ఏపీలో 'తల్లికి వందనం' పండుగ : ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు జమ!
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన తల్లికి వందనం పథకాన్ని వరుసగా రెండో ఏడాది అందజేసింది.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన తల్లికి వందనం పథకాన్ని వరుసగా రెండో ఏడాది అందజేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు జమ అవుతున్నాయి. 1వ తరగతితోపాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థుల తల్లి అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు తరగతుల్లో చేరిన విద్యార్థుల పూర్తి డేటా అందిన తర్వాత ఆగస్టులో రెండో విడతలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు కాకుండా, రూ.13 వేల చొప్పున మాత్రమే నిధులు జమ అవుతున్నాయి. మిగిలిన రూ.2 వేలు విద్యార్థులు చదువుతున్న పాఠశాలల అభివృద్దికి అందజేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక కూటమి ప్రభుత్వం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్) ద్వారా నిధులు జమ చేస్తుండటంతో మొబైల్ ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లు చూస్తూ తల్లులు సంబరపడిపోతున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు చేరుకుని డబ్బు విత్ డ్రా చేసుకోడానికి పోటీపడుతున్నారు. ఐదారుగురు పిల్లలు ఉన్న తల్లులకు సైతం పూర్తి నగదు జమ కావడంతో వారి కుటుంబాల్లో పండగ వాతావరణం కనిపించిందని అంటున్నారు. ఒక బిడ్డ ఉన్న తల్లికి రూ. 13 వేలు పడితే, చదువుకుంటున్న ఐదుగురు పిల్లలు ఉన్న ఇంట్లో రూ. 65 వేలు జమయ్యాయి. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ 'తల్లికి వందనం' అందిస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా నిలబెట్టుకుందని టీడీపీ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. ముందుగా చెప్పినట్లే బుధవారం ఉదయం నుంచే నగదు విడుదల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నిధుల విడుదల రేపు (శుక్రవారం 24వ తేదీ) కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. అదే రోజున మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు కూడా జరగనుండటంతో తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ ను ప్రభుత్వం తెలుసుకోవాలని భావిస్తోంది.
ఆరుగురికి రూ. 78 వేలు
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ డబ్బులు విడుదల చేయడంతో కొన్ని కుటంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పథకం వర్తించేది. అయితే ఇప్పుడు ఐదారుగురు ఉన్నప్పటికీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడంతో తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబవుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు సంతానం. వీరికి తల్లికి వందనం నిధులు ఒక్కొక్కరి రూ. 13 వేల చొప్పున మొత్తం రూ. 78 వేలు జమయ్యాయి. ఇదే జిల్లాలోని దేవనకొండ మండల కేంద్రంలో పింజరి చాంద్‌బాషా, షకీనాబీ దంపతులకు ఆరుగురు కుమార్తెలు సంతానం కాగా, ఈ ఏడాది పెద్ద కుమార్తె పదో తరగతి ఉత్తీర్హురాలయినా ఇంటర్‌లో చేరకపోవడంతో, మిగిలిన ఐదుగురు కుమార్తెలు షైనాజ్, సాహెరా, అమీషా, ఆసిఫా, సుబాన్‌లకు రూ. 13 వేలు చొప్పున రూ. 65 వేలు తల్లి షకీనాబీ ఖాతాలో జమ అయింది.
పల్నాడు నుంచి వైజాగ్ వరకు..
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పాపిరెడ్డికుంటతండాకు చెందిన కాత్లావత్ స్వామినాయక్ కుటుంబంలో ఐదుగురికి బుధవారం తల్లికి వందనం నగదు జమైంది. స్వామినాయక్‌కు ఏడుగురు సంతానం కాగా, గతేడాది ఇదే కుటుంబంలో ఆరుగురికి నగదు జమ అయింది. పెద్ద కుమార్తె రూపాబాయి పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరగా, చిన్న కుమారుణ్ని ఈ ఏడాదే పాఠశాలలో చేర్పించారు. వీరిద్దరికీ మలి విడతలో సొమ్ము జమ కానుందని అధికార వర్గాలు తెలియజేశాయి. తాను వైసీపీ హయాంలో వలంటీరుగా పనిచేశానని, గత ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేశామని స్వామినాయక్ చెప్పడం గమనార్హం. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఆల్విన్ కాలనీకి చెందిన షేక్ బాషా, రజియాభాను దంపతులు రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుని జీవిస్తుండగా, వీరి కుటుంబంలో ఐదుగురికి రూ. 65 వేలు రజియా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఇదే జిల్లా గుడిబండ మండలం మందలపల్లి గ్రామానికి చెందిన మేకలు కాస్తూ జీవనం సాగించే తిప్పమ్మ, కాంతరాజు దంపతులకు ఐదుగురు సంతానం కాగా, తిప్పమ్మ ఖాతాలో రూ. 65 వేలు జమయ్యాయి.
నెల్లూరు, ఏలూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో లబ్ధి
నెల్లూరు, ఏలూరు జిల్లాల్లోనూ కొందరికి రూ.65 వేలు జమ అయినట్లు చెబుతున్నారు. ఇక రాజస్థాన్ కు చెందిన ప్రజాపతి శాంతిలాల్ కుటుంబం ఏలూరులో స్థిరపడగా, వారికి ఇక్కడ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కుటుంబంలో ఐదుగురు కుమార్తెలకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. వీరి కుమారుడు కిరణ్ గతేడాది 10వ తరగతిలో 573 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు రూ. 25 వేల నగదు బహుమతి పొందడం విశేషం. అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన సయ్యద్ షర్మిలకు ఐదుగురు సంతానం కాగా, సమీర్, సబీహా ఇంటర్, జుబేర్ 8, జరీఫ్ 6, మషిహ 1వ తరగతి చదువుతుండటంతో రూ. 65 వేలు ఆమె అకౌంటులో జమయింది.