వైసీపీ కొత్త జట్టు...కూటమిని చూసేనా ?

ఇన్నాళ్ళు సింగిల్ గానే సింహం గానే అంటూ వచ్చిన వైసీపీకి కూడా గ్రౌండ్ రియాలిటీస్ అర్ధం అవుతున్నాయని అంటున్నారు.;

Update: 2025-12-17 03:52 GMT

ఏపీలో సింగిల్ పార్టీ ఏది అంటే వైసీపీ అని చెప్పాలి ఆ పార్టీ పుట్టినది లగాయితూ సొంతంగానే పోరాటాలను నమ్ముకుంది. రాజకీయాలను సొంతంగా చేస్తూ ఎదిగింది. అయితే 2014 సమయంలో వైసీపీతో చేతులు కలపడానికి బీజేపీ ఆసక్తిని చూపించింది అని వార్తలు వచ్చాయి. అయితే వైసీపీ బీజేపీల మధ్య ఎందుకో అది కుదరలేదు, ఇక 2019లో అయితే వైసీపీ పొత్తులో లేదు కానీ టీడీపీ పొత్తులు విచ్చిన్నం కావడంతో విజయం వైసీపీ పరం అయింది. కానీ 2024 నాటికి బొమ్మ తిరగబడింది. వైసీపీ మళ్ళీ ఒంటరిగానే విక్టరీ అనుకుంటూ ముందుకు సాగింది. కానీ మూడు పార్టీలతో అత్యంత పటిష్టంగా ఉన్న కూటమి ఎదురులేని తీరులో వైసీపీని ఓడించేసి కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. ఈ దెబ్బతో వైసీపీ రాజకీయ ఇబ్బందులు అన్నీ ఒకేసారి వచ్చేశాయి అని అంటున్నారు.

కూటమి మీద ఆశలు :

అదే సమయంలో వైసీపీ కూటమి మీద కొత్త ఆశలు పెట్టుకుంది. కూటమిలోని మూడు పార్టీలు విడిపోతాయని అది సాధ్యమే అవుతుందని రాజకీయాల్లో ఇలాంటివి గతంలో చాలా జరిగాయని కూడా భావించింది. కానీ ఎన్నికలలో పొత్తుల కంటే అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ జనసేన బీజేపీల మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది పూర్తి వాస్తవ దృక్పధంతో మూడు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. 2029లో సైతం కలిసే పోటీ చేస్తామని చెబుతున్నాయి. దాంతో కూటమి బలంగానే ఉంటుందని వైసీపీకి అర్ధమయ్యేసరికి నిరాశే మిగులుతోంది.

దోస్తులతోనే :

ఇన్నాళ్ళు సింగిల్ గానే సింహం గానే అంటూ వచ్చిన వైసీపీకి కూడా గ్రౌండ్ రియాలిటీస్ అర్ధం అవుతున్నాయని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఒంటరిగా వెళ్తే కూటమి ముందు ఇబ్బందులు తప్పవని కూడా వైసీపీలో వినిపిస్తున్న మాటగా ఉంది. దాంతో కలసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. ఈ పరిణామాలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో కూడా కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీకి కలసి వచ్చే పార్టీలు ఏమి ఉన్నాయని కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఆ రెండు పార్టీలే :

ఇక ఏపీలో వామపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది. ఇవి నామమాత్రంగానే ఉన్నాయని ఒక భావన ఉంది. ఇందులో కూడా చూస్తే కాంగ్రెస్ బలం అంతా వైసీపీ పరం అయింది. కాంగ్రెస్ కి దేశంలో కూడా గ్రాఫ్ పెరగడం లేదు, వరస ఓటములు సొంతం అవుతున్నాయి. దాంతో కాంగ్రెస్ తో పొత్తు అన్నది వైసీపీ ఆలోచించదని అంటున్నారు. ఇక మిగిలింది కామ్రేడ్స్. వారితో కలసి ముందుకు సాగితే ఎలా ఉంటుంది అన్నదే వైసీపీలో చర్చగా ఉంది. వారికి ఓటు బ్యాంక్ పెద్దగా లేకపోయినా జనంలో అయితే ఉద్యమాలను బలంగా నిర్మించిన చరిత్ర ఉంది. పైగా ప్రజా పోరాటాలు అంటే వామపక్షాలు ముందుగా గుర్తుకు వస్తారు. దాంతో వారితో చెలిమి చేస్తే ఎలా ఉంటుంది అన్నదే ఇపుడు వైసీపీలో జరుగుతున్న హాట్ డిస్కషన్ గా చెబుతున్నారు.

కామ్రేడ్స్ ఓకేనా :

ఇదిలా ఉంటే మరో ఆసక్తికరమైన పరిణామం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. సీపీఐకి కొత్తగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు అయిన ఈశ్వరయ్య తాజాగా మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ పై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ అంశం మీద ఇప్పటిదాకా ఏపీలో పోరాడుతోంది వైసీపీ మాత్రమే. ఆ పార్టీ అయితే కోటి సంతకాల సేకరణ వంటివి చేపట్టింది. ఇక గవర్నర్ ని కలసి వీటిని అందచేయాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో సీపీఐ కూడా ఇదే విషయం మీద పోరాటం చేయాలనుకోవడం వైసీపీకి బూస్టింగ్ ఇచ్చే అంశంగానే చూస్తున్నారు. ఒక భావ సారూప్యత కలిగిన అంశాలలో సీపీఐ వైసీపీ చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రానున్న రోజులలో సీపీఎం కూడా కూటమి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలకు సిద్ధపడుతోంది. దాంతో వామపక్షాలు ప్లస్ వైసీపీ అంటే బలమైన ఉద్యమాలు ఏపీలో నిర్మాణం అవుతాయని అంటున్నారు. అది రానున్న రోజులలో కొత్త జట్టుగా మారే చాన్స్ కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News