5 గంటల సిట్ విచారణలో కేసీఆర్ కు వేసిన ప్రశ్నలేంటి?
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ చేపట్టారు.;
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఐదు గంటల పాటు సాగిన విచారణలో కేసీఆర్ కు ఎదురైన ప్రశ్నలేంటి? వాటికి ఆయన చెప్పిన సమాధానాలేంటి? లాంటి సందేహాలు ఇప్పుడు అందరిని వేధిస్తున్నాయి. విచారణకు హాజరు కావటానికి ముందుగా కాస్తంత గంభీర వాతావరణంతో పాటు.. తన లాంటి అధినేత సిట్ విచారణకు హాజరు కావటాన్ని ఆయన ఒక పట్టాన జీర్ణించుకోలేనట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఐదు గంటల సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్.. తన కోసం వేచి చూస్తున్న క్యాడర్ కు అభివాదం చేశారు. కొందరు నేతల్ని కలిశారు. వారితో కాసిన్ని ముచ్చట్లు చెప్పారు. ఈ సందర్భంగా సిట్ విచారణ తనను ఏ మాత్రం ప్రభావితం చేయలేదన్న సంకేతాల్ని ఇచ్చారు. ఆయన్నుకలిసిన కొందరుబీ ఆర్ఎస్ నేతలు ఇదే విషయాన్ని గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి వేళ.. ఐదు గంటల విచారణలో కేసీఆర్ ఎదుర్కొన్న ప్రశ్నలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ ఇల్లు అయితే వ్యూహరచనకు కేంద్రంగా ఉండేదో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లు నాన్ స్టాప్ గా తిరుగులేని అధికారానికి కేంద్రంగా.. రాజకీయ వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఇంట్లో.. నేడు పలువురు అధికారుల సమక్షంలో దగ్గరదగ్గర ఐదు గంటల (కచ్ఛితంగా చెప్పాలంటే నాలుగున్నర గంటలకు పైనే) పాటు ప్రశ్నలు అడుగుతుంటే.. తాను సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని కేసీఆర్ తట్టుకోలేకపోయినట్లుగా చెబుతున్నారు. నందినగర్ ఇంట్లోని రెండో అంతస్తులోని గదిని సిట్ విచారణ కోసం ఎంపిక చేశారు.
విచారణ జరిగిన సమయంలో కేటీఆర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, న్యాయవాది రాంచందర్ రావులను మాత్రమే అనుమతించారు. దీంతో హరీశ్ తో పాటు మిగిలిన వారంతా తెలంగాణ భవన్ కు వెళ్లాల్సి వచ్చింది. విచారణ సమయంలో కేసీఆర్ మినహా మిగిలిన వారంతా ఇంట్లోని ఇతర గదుల్లో ఉండాలని పంపేసినట్లుగా తెలుస్తోంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ అధికారుల కమిటీలో ఉన్న అధికారుల విషయానికి వస్తే.
హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్
దర్యాప్తు అధికారి వెంకటగిరి
మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి
గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి
శంషాబాద్ అదనపు డీసీపీ కేఎస్ రావు
మహంకాళి ఏసీపీ శ్రీధర్
విచారణ అనంతరం వారంతా సిట్ చీఫ్ సజ్జనార్ తో సమావేశమయ్యారు. విచారణలో భాగంగా పలు ప్రశ్నల్ని కేసీఆర్ ఎదుర్కొన్నట్లుగా తెలిసింది.మావోయిస్టుల పేరుతో ఫోన్లు ట్యాపింగ్ చేయించారా? ఎన్నికల్లో గెలుపునకు ట్యాపింగ్ ను ఆయుధంగా వాడుకున్నారా? సుప్రీం అంటే ఎవరు? రిటైర్ అయిన అధికారుల్ని ఎందుకు కంటిన్యూ చేశారు? ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీసు అధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పునర్నియామకాలు, ప్రణీత్ రావు ప్రమోషన్ కు సంబంధించిన అంశాలపై గుచ్చి గుచ్చి అడిగినట్లుగా తెలుస్తోంది.
రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభాకర్రావును కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నతో పాటు.. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా రెండేళ్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.. కానీ మీరు ప్రభాకర్ రావుకు మూడేళ్లు పొడిగింపు ఎందుకు ఇచ్చారు? దీని వెనకున్న మతలబు ఏంటి? అసాధారణ రీతిలో ఆయననే నిఘా చీఫ్ గా ఎందుకు నియమించారు? ఆ అవసరం ఏమిటి? అర్హత లేకున్నా ఆయననే చట్టబద్ధమైన డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించానికి కారణాలేంటి? 2007 ఎస్ఐ బ్యాచ్ లో మరెవరికీ లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా ప్రమోషన్ కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్నలు ఎదురైనట్లుగా తెలిసింది.
బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయిల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చిన అంశంపైనా ప్రశ్నలు ఎదురైనట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బయటకు వచ్చిన ఆడియో టేపులు మీకు ఎవరు ఇచ్చారు? అన్న ప్రశ్న కూడా ఎదురైందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు, మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల వేళ విచ్చలవిడిగా వార్ రూంల ఏర్పాటు చేసి అనధికారికంగా వేలాది ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం మీ ఆదేశాలతో జరిగిందా? ఇందులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ పాత్ర ఉందా? లాంటి ప్రశ్నలతో పాటు తాము అడిగే కొన్ని ప్రశ్నలకు సంబంధించి డిజిటల్ రికార్డులు, ఆధారాల్ని చూపించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.