ముద్రగడ ఫ్యామిలీ సంచలన నిర్ణయం.. ప్రభుత్వానికి షాక్!
ముద్రగడ అంత్యక్రియలకు ప్రభుత్వ అధికార లాంఛనాలను కుటుంబ సభ్యులు తిరస్కరించడం తీవ్ర సంచలనంగా మారింది.
మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ముద్రగడ జీవించి ఉండగా తీవ్ర అవమానాలకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు సానుభూతి చూపడం అవసరం లేదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ముద్రగడ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని, ప్రజలు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ముద్రగడ అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
ముద్రగడ అంత్యక్రియలకు ప్రభుత్వ అధికార లాంఛనాలను కుటుంబ సభ్యులు తిరస్కరించడం తీవ్ర సంచలనంగా మారింది. నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ముద్రగడకు పోలీసు గౌరవ వందనం మధ్య అధికార లాంఛనాలతో అంతిమ సంస్కరాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైన ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంకు ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదనే ఆలోచనతో కుటుంబ సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారని పరిశీలకులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం మాజీ ప్రజాప్రతినిధులు మరణించిన సమయంలో వారి అంతిమ సంస్కారాలకు అధికార లాంఛనాలు సమకూర్చడం సహజమని అంటున్నారు. పోలీసు గౌరవ వందనంతో గాలిలోకి కాల్పులు జరిపి నివాళులు అర్పిస్తారు. అయితే బతికిన రోజుల్లో పోలీసులతో ముద్రగడను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి గతంలో చోటుచేసుకున్న సంఘటనలే కారణంగా భావిస్తున్నారు.
కాపు ఉద్యమాలు నడిపిన ముద్రగడ పలుమార్లు ఆమరణ నిరాహారదీక్షలు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను వేధించేవారని గుర్తు చేస్తున్నారు. ఈ కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముద్రగడ తీవ్రవ్యతిరేకత పెంచుకున్నారని, తుది శ్వాస విడిచే వరకు అదే కోపం ఆయనలో ఉందని అంటున్నారు. అందుకే అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని అంటున్నారు. చివరి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ముద్రగడ అంతిమ సంస్కారాల సమయంలో రాజీ పడ్డారనే అభిప్రాయానికి తావివ్వకుండా కుటుంబ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు చెబుతున్నారు.