ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ ఆదర్శం.. ఎందుకో తెలుసా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ముంబైలో కుడి భుజం రొటైటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంటును తిరస్కరించారని చెబుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ముంబైలో కుడి భుజం రొటైటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంటును తిరస్కరించారని చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చులకు ప్రభుత్వమే భరించనుండగా, పవన్ మాత్రం ప్రభుత్వ నిధులను వాడుకునేందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. తన వైద్యానికి సొంత డబ్బులే ఖర్చు చేసుకుంటానని పవన్ సంబంధిత అధికారులకు తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయంపై విస్తృత చర్చ జరుగుతోంది.
సహజంగా ప్రభుత్వ సౌకర్యాలను వాడుకునేందుకు చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తుంటారు. కానీ, పవన్ తన రూటే సెపరేటు అని తొలి నుంచి నిరూపిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం చెల్లించే అలవెన్సులను పవన్ వద్దనుకున్నారు. తన పర్యటనలకు అయ్యే ఖర్చులకు సైతం సొంత డబ్బే వినియోగిస్తున్నారని చెబుతున్నారు. క్యాంపు కార్యాలయానికి కొత్త ఫర్నీచర్ కొనుగోలు ఖర్చులను కూడా ఆయన వద్దని చెప్పారని గుర్తు చేస్తున్నారు. అయితే నిబంధన ప్రకారం తనకు వచ్చే అధికారిక వేతన మొత్తాన్ని ఆయన తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి చెందిన 42 మంది అనాథ పిల్లల చదువు, సంక్షేమం కోసం నెలవారీ ఆర్థిక సాయం ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున విరాళంగా అందిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పవన్ వైద్య ఖర్చులను తిరస్కరించడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తి ఉచిత వైద్యం పొందడానికి అర్హులుగా నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో లేదా నిపుణులైన వైద్యుల సిఫారసు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే, ఆ ఖర్చులను కూడా ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. నిపుణులైన వైద్యుల సలహా మేరకు ముంబైలో ప్రత్యేక శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కు ప్రభుత్వం ఆ ఖర్చు చెల్లించేందుకు సిద్ధమైన ఆయన నిరాకరించారని చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ లో సైనసటీస్ కు శస్త్రచికిత్స చేసిన సమయంలోనూ పవన్ ఒక్క పైసా కూడా తీసుకోలేదని అంటున్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యం అందని సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స చేయించుకుని ఆ ఖర్చులు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇందుకు పరిమితులు ఉండగా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ప్రజాప్రతినిధులు వైద్యం చేయించుకోవచ్చు. ఈ విషయంలో చాలా మంది ప్రజాప్రతినిధులు బిల్లులు పెట్టుకుని ప్రభుత్వం నుంచి ఖర్చులు డ్రా చేసుకుంటారని చెబుతున్నారు. పవన్ మాత్రం తన సొంత ఖర్చులతోనే వైద్యం చేయించుకుంటానని చెప్పి మిగిలిన నేతలకు ఆదర్శంగా మారారని అంటున్నారు.