జగన్ భీమవరం సభ.. హైటెన్షన్.. హైడ్రామా!

అంతేకాకుండా ఆయన సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా కొందరు సభలో వేసిన టెంట్స్ పోల్స్ ఎక్కి హడావుడి చేశారు.

Update: 2026-07-15 09:15 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భీమవరం పర్యటనలో గందగోళం చోటుచేసుకుంది. ఆక్వా రైతుల పరామర్శకు భీమవరం వచ్చిన జగన్ సభలో ప్రసంగిస్తుండగా కార్యకర్తలు హంగామా సృష్టించారు. సభలో జగన్ మాట్లాడిన తర్వాత వెనుదిరిగి వెళ్లిపోతున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. ఒకానొక సమయంలో కార్యకర్తల తాకిడితో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి కిందపడబోయారు. అంతేకాకుండా ఆయన సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా కొందరు సభలో వేసిన టెంట్స్ పోల్స్ ఎక్కి హడావుడి చేశారు.

మాజీ సీఎం జగన్ రెడ్డి పర్యటనలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. అభిమానులు నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. భీమవరం సభలో అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో జగన్ కూడా ఇబ్బంది పడినట్లు కనిపించింది. జగన్ తో కరచాలనం చేసేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు కార్యకర్తలు ఎగబడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం ను చుట్టుముట్టడంతో ఆయన ఎటూ కదలలేని పరిస్థితికి చేరుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. మాజీ సీఎంపైకి దూసుకువస్తున్న అభిమానులను అడ్డుకుని వేదికపై నుంచి కిందకు విసిరేశారు. ఈ క్రమంలో తోపులాట, తొక్కిసలాట జరిగే ప్రమాదంపై ఆందోళన వ్యక్తమైంది.

ఎప్పుడూ ఇంతేనా..

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సభలు, సమావేశాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొనడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాస్ లీడర్ గా ఎలివేషన్ కోసం వైసీపీ నేతలు స్వయంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారని విపక్ష పార్టీల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అవసరం అయిదానికి కానిదానికి ఇలా ప్రవర్తించడంపైనే సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతుంటుందని అంటున్నారు. జగన్ రెడ్డికి ఎక్కడికి వెళ్లినా జనం రద్దీ ఎక్కువగా ఉండేలా పార్టీ ఏర్పాట్లు చేస్తుంటుందని, దాంతో ప్రైవేటు కార్యక్రమాలు అయిన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో సైతం వైసీపీ కార్యకర్తలు అనవసర హంగామా చేస్తుంటారని విమర్శలు చేస్తున్నారు.

మాస్ జాతర

అయితే విపక్షాల విమర్శలను వైసీపీ కొట్టిపడేస్తుంది. రాష్ట్రంలో ఏ ఇతర నేతకు లేనిస్థాయిలో జగన్ రెడ్డికి మాస్ ఇమేజ్ ఉందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే మాజీ సీఎం ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతారని అంటున్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత ఎక్కడికి వెళ్లినా వేల మందితో కార్యక్రమాలు నిర్వహించడానికే వైసీపీ ప్రాధాన్యమిస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లె టూరు మొదలుకొని తాజాగా భీమవరం టూర్ వరకు జగన్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఏదో సమస్య వెలుగుచూస్తునే ఉంది. సత్తెనపల్లె పర్యటన సందర్భంగా జగన్ కాన్వాయ్ కింద ఓ కార్యకర్త పడి మరణించాడు. అదేవిధంగా అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్లిన సమయంలో హెలికాఫ్టర్ పైకి కార్యకర్తలు దూసుకువెళ్లడంతో జగన్ తిరుగు ప్రయాణానికి హెలికాఫ్టర్ పనికిరాకుండా పోయిందని అంటున్నారు. తాజాగా భీమవరంలో సైతం ఇటువంటి హడావుడే కనిపించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. అభిమానులను వేదికపై నుంచి కిందకు తోసివేసిన సమయంలో ఏమైనా తొక్కిసలాట జరిగితే పెద్ద ప్రమాదానికి దారితీసేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News