చట్టం కాదు… పిల్లల రక్షణలో తల్లిదండ్రులే కీలకం

పిల్లలను సోషల్ మీడియా వ్యసనం నుండి కాపాడేందుకు ప్రపంచ దేశాలు కఠినమైన చట్టాలు తెస్తున్నాయి.

Update: 2026-07-15 09:30 GMT

పిల్లలను సోషల్ మీడియా వ్యసనం నుండి కాపాడేందుకు ప్రపంచ దేశాలు కఠినమైన చట్టాలు తెస్తున్నాయి. బ్రిటన్ రాత్రి వేళల్లో యాప్స్ లాక్ చేస్తుంటే, ఆస్ట్రేలియా ఏకంగా చిన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కానీ, ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా అవి మన బెడ్‌రూమ్‌ల్లోకి వచ్చి నిఘా పెట్టలేవు. చట్టాలు కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే, కానీ అసలైన రక్షణ ఇంట్లోనే, తల్లిదండ్రుల నిఘాలోనే మొదలవ్వాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..

గ్లోబల్ ట్రెండ్.. సోషల్ మీడియాపై దేశాల పంజా:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లల మానసిక ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు యుద్ధం ప్రకటిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టం తెచ్చింది. ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లను పూర్తిగా బ్యాన్ చేస్తోంది. అమెరికాలో కూడా పిల్లల డేటా భద్రత కోసం కొత్త రూల్స్ తెస్తున్నారు. ఇవన్నీ వినడానికి బాగున్నా.. డిజిటల్ ప్రపంచంలో దొంగదారులు చాలా ఎక్కువ. ఇక విపిఎన్ వాడటం లేదా సెట్టింగ్స్ మార్చడం ద్వారా పిల్లలు ఈ చట్టాల కళ్లు గప్పుతున్నారు.

బెడ్‌రూమ్‌కు చట్టాలు వర్తించవు:

ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టం చేసినా, రాత్రి వేళల్లో బెడ్‌రూమ్ తలుపులు వేసుకుని పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారో ఏ అధికారీ వచ్చి గమనించలేడు. బ్రిటన్ లాంటి దేశాలు అర్ధరాత్రి యాప్స్ లాక్ చేసినా, పిల్లలు సాంకేతికంగా తల్లిదండ్రుల కంటే స్మార్ట్ కాబట్టి వాటిని దాటేస్తున్నారు. ఇక్కడే చట్టాల పరిమితి స్పష్టమవుతోంది. ఇక చట్టం కేవలం దారి చూపగలదు కానీ, ఆ దారిలో పిల్లలు తప్పుటడుగులు వేయకుండా చూడాల్సింది కచ్చితంగా పేరెంట్స్ మాత్రమే.

ముందుగా మారాల్సింది తల్లిదండ్రులే:

పిల్లలకు నీతులు చెప్పే ముందు తల్లిదండ్రులు తమ అలవాట్లను మార్చుకోవాలి. ఆఫీస్ నుండి రాగానే ఫోన్ పట్టుకుని కూర్చునే తల్లిదండ్రులను చూసే పిల్లలు కూడా మొబైల్స్‌కు బానిసలవుతున్నారు. ఇంట్లో "నో ఫోన్ జోన్" లేదా రాత్రి ఒక నిర్దిష్ట సమయం దాటాక అందరూ ఫోన్లు పక్కన పెట్టే రూల్ పెట్టుకోవాలి. ఇక మనం డిజిటల్ డిసిప్లిన్ పాటిస్తే, పిల్లలు దాన్ని చూసి చాలా సులభంగా నేర్చుకుంటారు.

డిజిటల్ పేరెంటింగ్.. నేటి తరం అవసరం:

ఆధునిక కాలంలో పిల్లలకు కేవలం మంచి ఆహారం, చదువు ఇస్తే సరిపోదు.. 'డిజిటల్ పేరెంటింగ్' కూడా తెలియాలి. ఫోన్లలో పేరంటల్ కంట్రోల్స్ ఆన్ చేయడం, వారు ఇంటర్నెట్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో గమనించడం ముఖ్యం. అంతకంటే ముఖ్యంగా, వారితో ప్రతిరోజూ మాట్లాడాలి. ఇక సోషల్ మీడియా ప్రపంచం కంటే నిజమైన ప్రపంచం ఎంత బాగుంటుందో వారికి శారీరక ఆటలు, పుస్తకాల ద్వారా పరిచయం చేయాలి.

బాధ్యత మనదే:

ప్రభుత్వాలు రూల్స్ మారుస్తూ చట్టాలు చేయవచ్చు, టెక్నాలజీ కంపెనీలు కొత్త ఫీచర్లు తేవచ్చు. కానీ పసి మొగ్గల్లాంటి పిల్లల భవిష్యత్తును కాపాడుకునే అంతిమ బాధ్యత తల్లిదండ్రులదే. ఇక చట్టాలపై ఆధారపడటం మానేసి, ఇంట్లోనే ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించినప్పుడే మన పిల్లలను ఈ వర్చువల్ మాయా ప్రపంచం నుండి సురక్షితంగా బయటపడేయగలం.

Tags:    

Similar News