ఉన్మాది రాజ్ కుమార్ సూసైడ్.. సమాధానాలు లేని ప్రశ్నలెన్నో!
ఒక వ్యక్తి ఆరుగురిని అమానుషంగా అంతమొందించిన దారుణ ఘటనతో షాక్ ఇప్పటికి వెంటాడుతోంది.
ఒక వ్యక్తి ఆరుగురిని అమానుషంగా అంతమొందించిన దారుణ ఘటనతో షాక్ ఇప్పటికి వెంటాడుతోంది. ఒక సాదాసీదా వ్యక్తి అంత దుర్మార్గంగా.. కసాయిగా ఎలా మారాడు? అన్నది ప్రశ్న. తనకున్న ఆస్తులు కరిగిపోయేలా చేసి.. అప్పుల పాలు అయ్యేందుకు కారణమైనోళ్ల మీద పగ తీర్చుకోవాలన్న మాటను జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకవేళ అదే నిజమైతే వారిని అంతం చేయటంతో ఆగకుండా.. సొంత కుటుంబ సభ్యులను సైతం దారుణంగా హతమార్చటం చూస్తే.. అతడిలోని ఉన్మాది ఎంతలా పెరిగి పెద్దవాడయ్యాన్న దానికి నిదర్శనంగా తాజా పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు.
తనను అప్రదిష్టపాలు చేసిన మైనర్ బాలిక కుటుంబాన్ని అంతం చేసిన అతను.. తన టార్గెట్ గా మరో నలుగురిని కూడా చేసుకున్నాడా? అన్న ప్రశ్నఇప్పుడు చర్చగా మారింది. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సైకో రాజకుమార్ సూసైడ్ చేసుకొని చనిపోయినంతనే ఈ ఇష్యూ ఇక్కడితో సమాప్తం కాలేదంటున్నారు. ఎందుకంటే.. సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని చెబుతున్నారు. తన దారుణకాండకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోతో పాటు.. తన భార్య, పిల్లలను ఎందుకుచంపాల్సి వస్తోందన్న విషయాన్ని వివరిస్తూ నాలుగు పేజీల్లో స్టాంప్ పేపర్ల మీద రాసి ఉండటం చూస్తే.. అతను పక్కాగా ప్లాన్ చేసి తాను చేయాల్సిన దారుణాన్ని చేపట్టినట్లుగా అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. ఉన్మాది రాజ్ కుమార్ హిట్ లిస్టులో మరో నలుగురు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నప్పటికి.. ఆరు నిండు ప్రాణాలు పోవటానికి దారి తీసిన అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ చేపట్టిన మారణకాండకు పరోక్షంగా పోలీసుల పాత్ర ఉందన్న అంశంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అతడిపై పోక్సో కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోక్సో కేసు పెట్టాల్సి ఉన్నప్పటికి బెయిల్ వచ్చేందుకు వీలుగా కొన్ని సెక్షన్లు మార్చటం..అందుకు ప్రతిఫలంగా కొందరు పోలీసు అధికారులకు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. కొందరు రూ.10లక్షలు అంటుంటే.. మరికొందరు రూ.25 లక్షల డీల్ కుదుర్చుకున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.దీనిపై ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి రహస్యంగా విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. బెయిల్ వెనుక కీలకపాత్ర పోషించిన వారెవరన్న దానికి సంబంధించి నివేదికను ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
తాను చేసే మారణకాండకు 28 ఏళ్ల సైకో రాజ్ కుమార్ పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లుగా చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరే అంశాల్ని చూస్తే.. గంట వ్యవధిలోనే ఆరుగురిని హత్య చేయటం.. అందుకు తెల్లవారుజాము ప్రాంతాన్ని ఎంచుకోవటం మాత్రమే కాదు.. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. పెద్ద ఎత్తున సీసీ కెమేరాల్ని జల్లెడ పోసినా.. అతను ఏ పురుగుల మందు షాపులోనూ దానికి కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు లభించకపోవటం చూస్తే.. ముందస్తుగానే అతను పురుగుల మందును కొని పెట్టుకొని ఉంటాడని చెబుతున్నారు. తాను చేసే దారుణ హత్యల తర్వాత తన భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందుకు తగ్గట్లే.. స్టాంప్ పేపర్ల మీద తాను చెప్పాల్సిన విషయాల్ని చెప్పటం.. హత్యలకు ముందుగానే వీడియో తీసి పెట్టుకోవటం లాంటి అంశాలే నిదర్శనంగా చెబుతున్నారు. అయితే.. మైనర్ బాలిక కుటుంబంలో మరో నలుగురిని కూడా టార్గెట్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలిక మేనమామ రాజు.. బాబాయ్ శ్రీనివాస్.. అతడి సతీమణి.. నరేష్ లు కూడా తన మీద పోక్సో కేసు పెట్టేందుకు కారణమని సైకో రాజ్ కుమార్ నమ్మినట్లుగా తెలుస్తోంది. తాను చేపట్టిన మారణకాండ రోజున ఆ నలుగురు అక్కడ లేకపోవటంతో వారి బతికిపోయినట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా సైకో రాజ్ కుమార్ సూసైడ్ తోనే ఈ దారుణ మారణకాండ ఉదంతం ముగిసిపోలేదని.. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపిన ఈ ఉదంతానికి సంబంధించి మరింత లోతు విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లోనే వ్యక్తం కావటం గమనార్హం.