డోర్ లాక్ చేసుకోకుండా ఆ సీఎం ఉండలేరట

Update: 2017-01-21 10:25 GMT
ముఖ్యమంత్రి ఏంటి? డోర్ లాక్ ఏంటి? సీఎంగా ఉండేవాళ్లు డోర్ చేసుకోకూడదా? ఇంతకీ అదే డోర్ లాక్? లాంటి సందేహాలు వస్తున్నాయా? కాస్త చదివితే చాలు.. అన్ని ఇట్టే అర్థమవుతాయి. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పనరయ విజయన్ కు ఒక అలవాటు ఉందట. చీమ కూడా దూరని సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయన గెస్ట్ హౌస్ కి వెళితే.. తన డోర్ కు లాక్ వేసుకోకుండా ఉండలేరట. అదిప్పుడు ఆ రాష్ట్ర ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది.

ఎందుకంటే.. విజయన్ కు ముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అచ్యుతానందన్ ఏ రోజూ డోర్ లాక్ వేసుకునే వారు కాదట. కానీ.. విజయన్ మాత్రం అందుకు భిన్నంగా డోర్ లాక్ చేసుకోనిదే ఉండలేరట. ఆయన డోర్ లాక్ చేసుకునే అలవాటు ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసేసింది. ఎర్నాకులం జిల్లాలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో సీఎం బస చేసిన రూమ్ లాక్ పని చేయలేదు. దీంతో.. దాన్ని రిపేర్ చేయించాల్సిందిగా ఆదేశించారు.

ముఖ్యమంత్రి వారి నుంచి ఆదేశాలు జారీ అయ్యాక పని జరగకుండా ఉంటుందా? అధికారులు రంగంలోకి దిగి డోర్ లాక్ రిపేర్ చేసేశారు. అయితే.. ఆ తర్వాతి రోజున గెస్ట్ హౌస్ కి వచ్చిన ముఖ్యమంత్రి డోర్ లాక్ వేసే ప్రయత్నం చేయటం.. లాక్ పడకపోవటంతో.. చిర్రెత్తుకొచ్చిందట. తన విషయంలోనూ అలా జరిగితే.. మిగిలిన విషయాల్లో అధికారుల తీరు ఇంకెలా ఉంటుందన్న కోపం వచ్చేసిందట. అంతే.. ఈ అంశం మీద విచారణ జరిపించిన ముఖ్యమంత్రి బాధ్యతగా పని చేయని ఇద్దరు అధికారులపై వేటు వేశారు. గతంలో ముఖ్యమంత్రి డోర్ వేసుకొనే వారే కానీ.. లాక్ చేసే వారు కాదని.. అయినా.. భారీ భద్రత ఉండే చోట ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించటం ఏమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News