2022లో ఇంటర్వ్యూలు లేకుండా ‘డాలర్ డ్రీం’ వీసా జారీ!

Update: 2021-12-25 23:30 GMT
డాలర్ డ్రీంను సాకారం చేసుకోవటానికి అమెరికాకు పయనమయ్యే వారందరిని ఇబ్బందికి గురి చేసేది వీసా గండం. అక్కడ స్టాంపింగ్ పూర్తి అయితే కానీ.. డాలర్ డ్రీం ఒ కొలిక్కి రానట్లే. ఇప్పటివరకు అమెరికా వీసా జారీ కోసం ఇంటర్వ్యూను నిర్వహించటం.. దాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాల్సి ఉంటుంది.

తాజాగా.. ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేయనున్నారు. హెచ్ 1బి.. హెచ్3.. ఎల్.. ఓ.. పీ.. క్యూ తదితర వీసాలు పొందాలనుకునే వారికి తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. దీనికి సంబంధించిన విచక్షణ అధికారాన్ని కాన్సులేట్ అధికారులకు అప్పజెప్పారు.

ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో 2022 ఏడాది మొత్తానికి వీసాల జారీకి ఇంటర్వ్యూల్ని తాత్కాలికంగా బంద్ చేయాలని నిర్ణయించారు. అయితే.. వీసా జారీకి సంబంధించి ఎవరికైనా ఇంటర్వ్యూలు నిర్వహించాలని కాన్సులేట్ అధికారులు భావిస్తే.. వారిని పిలిచే వీలుంది. ఏమైనా వీసా జారీకి స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటివరకు అమెరికా వీసాకు వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి. అందులో ఎంపికైతేనే.. అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది.

ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇంటర్వ్యూ ఆధారంగా వీసాలు జారీ చేసే విధానాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్వ్యూలు అవసరం లేని వీసా కేటగిరుల విషయానికి వస్తే.. ప్రత్యేక వ్రత్తి నిపుణులు (హెచ్ 1బి).. శిక్షణ, ప్రత్యేక విద్య సందర్శకులు (హెచ్3).. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యేవారు (ఎల్).. విశేష ప్రతిభావంతులు (ఓ).. క్రీడాకారులు.. కళాకారులు.. వినోదరంగానికి చెందిన వారు (పి).. ఇంటర్నేషనల్ కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొనే వారికి(క్యూ) ఇంటర్వ్యూ అవసరం లేకుండా వీసా జారీ ఉంటుంది. అంతేకాదు.. ఇప్పటికే వీసా ఒకసారి పొంది దాని కాలపరిమితి ముగిసే 48 నెలల్లోగా పునరుద్ధరించాలనుకునేవారికి కూడా వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇంటర్వ్యూ లేకుండా వీసా జారీ విధానం ఈ ఏడాది ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో చూడాలి.


Tags:    

Similar News