జయలలిత శాంపిల్స్ లేవు:అపోలో
గత ఏడాది డిసెంబరు 5న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన విషయం విదితమే. అయితే, తాను జయలలిత కుమార్తె అంటూ బెంగళూరుకు చెందిన అమృత సుప్రీం కోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. సుప్రీం సూచనల ప్రకారం అమృత....మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అవసరమైతే తనకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత కోరారు. దీంతో, అమృత-జయలలిత ల సంబంధంపై విచారణ జరపాలని తమిళనాడు సర్కార్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నపుడు ఆమె రక్త నమూనాలు, చర్మం, తల వెంట్రుకలు సేకరించారో లేదో తెలియజెప్పాలని అపోలో ఆసుపత్రికి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వైద్యనాధన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ నోటీసులపై అపోలో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. జయలలిత బయోలాజికల్ శాంపిల్స్ తమ వద్ద లేవని మద్రాస్ హైకోర్టుకు అపోలో యాజమాన్యం స్పష్టం చేసింది.
జయలలిత మరణానంతరం తాను ఆమె కూతురునని అమృత తెరపైకి రావడం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమెకు సంబంధించిన వివరాలను ఇంటిలిజెన్స్ అధికారులు సేకరించేందుకు సిద్ధమయ్యారు. అమృత వాదనలపై జయ మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలు అభ్యంతరం తెలిపారు. ఆమె వాదనలకు ఎటువంటి ఆధారాలూ లేవని, అందువల్ల ఆమె కేవలం సివిల్ కోర్టునే ఆశ్రయించాలని చెప్పారు. పోయెస్ గార్డెన్స్ లో లేదా బెంగళూరు పర్యటనల సందర్భంగా జయలలితను అమృత కలిసినట్టు ఆధారాలు లేవని కోర్టుకు తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా పడింది.