ఐదేళ్లలో 9 లక్షలు.. పౌరసత్వం వదులుకున్న భారతీయులు
భారతీయులు సహజంగా ఎంచుకునేది అమెరికానే. ఈ లెక్కనే ఆ దేశంలోనే మనవారు అధికంగా ఉంటారని భావిస్తే అది సరికాదు.;
14 ఏళ్లలో 20 లక్షలు.. ఇదీ భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య. వీరిలో గత ఐదేళ్లలోనే 9 లక్షల మంది ఉన్నారు. అంటే, 2011 నుంచి 2020 వరకు 9 సంవత్సరాలలో 11 లక్షల మంది భారతీయులు తమకు ఈ దేశ పౌరసత్వం వద్దు అని అంటే... గత ఐదేళ్లలోనే అందులో 80 శాతం మంది పౌరసత్వం త్యజించారు. ఈ గణాంకాలను తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంటుకు వెల్లడించారు. దేశ పౌరసత్వం విషయంలో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి రికార్డులను ఏటా భద్రపరుస్తున్నట్లు చెప్పారు. ఈ లెక్కన 2011-19 మధ్య 11.89 లక్షల మంది పైగా పౌరసత్వం వద్దని చెప్పినట్లు పేర్కొన్నారు.
విదేశీ పౌరసత్వం ఎంచుకుని..
పద్నాలుగేళ్లలో 20 లక్షలమంది పౌరసత్వం త్యజించారంటే.. వీరంతా విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకున్నట్లే. ఇక 5 ఏళ్లలో 9 లక్షల మంది భారత పౌరసత్వ కాదని విదేశీ పౌరసత్వం ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. వీరంతా ఏ దేశంలో స్థిరపడింది? అనేది వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉన్నారు.
అత్యధికం పశ్చిమాసియాలోనే...
భారతీయులు సహజంగా ఎంచుకునేది అమెరికానే. ఈ లెక్కనే ఆ దేశంలోనే మనవారు అధికంగా ఉంటారని భావిస్తే అది సరికాదు. భారతీయులు ఎక్కువగా పశ్చిమాసియాలో కావడం గమనార్హం. అదికూడా యూఏఈ, సౌదీ అరేబియాల్లోనే అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, కెనడాలో స్థిరపడ్డారు. ఆగ్నేయాసియా దేశాలు మలేసియా, సింగపూర్, యూకే దేశాలు భారతీయులకు గమ్యస్థానంగా ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేయాలనే భారత యువత ఆశలను ఆసరాగా చేసుకుని నకిలీ ఆఫర్లతో మోసాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చాలావరకు సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి మోసపోయినవారేనని కేంద్ర మంత్రి కీర్తివర్థన్ తెలిపారు.
ఆర్థికంగా స్థిరపడాలని...
విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్న భారతీయులు తమ పౌరసత్వాలను వదులుకుంటున్న వైనం గత కొన్నేళ్లుగా పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఆర్థిక అవకాశాలు, విద్యా సౌకర్యాలు, మెరుగైన జీవనం కోరుకుంటున్నవారు విదేశాలకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.