బంతి ట్రంప్ కోర్టులో వేసిన ఇరాన్... సూటి హెచ్చరికలు ఇదే ఫస్ట్!

ఇరాన్ లో ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారి భారీ ప్రాణ నష్టానికి దారి తీసిన సంగతి తెలిసిందే.;

Update: 2026-02-02 04:13 GMT

ఇరాన్ లో ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారి భారీ ప్రాణ నష్టానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిరసనకారులపై ప్రభుత్వం తీవ్ర అణిచివేత ధోరణి అవలంభించింది. ఈ ఘటనల్లో సుమారు పాతికవేలకు పైనే మరణాలు సంభవించాయని అంటున్నా.. ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా, స్వల్పంగా ఉన్న పరిస్థితి. ఈ సమయంలో నిరసనలపై అణిచివేతకు ప్రతిస్పందనగా సైనికపరంగా జోక్యం చేసుకుంటామని ట్రంప్ బెదిరించారు.

అవి మాటల వరకే పరిమితం కాలేదనే సంకేతాలు గత కొన్ని రోజులుగా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... భారీ యుద్ధ విమానాల వాహన నౌకను పశ్చిమాసియావైపూ కదిలించిన అమెరికా.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్ లను మొహరించినట్లు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఈ వేడిని రోజు రోజుకీ పెంచుతుంది. మరోవైపు అమెరికాతో తాము యుద్ధం కోరుకోవడం లేదని ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ సమయంలో ఖమేనీ స్పందించారు.

అవును... పశిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సంగతి తెలిసిందే! అణు ఒప్పందం విషయంలో అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్ పై సైనిక చర్య తప్పదని చెబుతున్న ట్రంప్.. ముందుకు కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరో పక్క ఇజ్రాయేల్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇంకోపక్క ఎర్ర సముద్రంపై అనధికారికంగా పెత్తనం చేస్తున్న హౌతీలు అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు.

టెహ్రాన్ లోని తన కాంపౌండ్ వద్ద భారీగా గుమిగూడిన జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడిన అయతుల్లా అలీ ఖమేనీ... తమపై అమెరికా దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని అన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోము కానీ.. తమపై ఎవరైనా దాడికి పాల్పడితే మాత్రం వారికి ఇరాన్ గట్టిగా సమాధానం చెబుతుందని తెలిపారు. అమెరికా యుద్ధ నౌకలు రంగంలోకి దిగిన తర్వాత ఖమేనీ నుంచి ఇలా సూటి హెచ్చరికలు రావడం ఇదే ఫస్ట్ టైం!

ఇదే సమయంలో... యురోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాల సైన్యాలన్నింటినీ తాము ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్ ప్రకటించగా.. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల నాయకులు ఇరాన్ లో అశాంతికి ఆజ్యం పోస్తున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. అగ్రరాజ్యంతో తాము యుద్ధం కోరుకోవడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇరాన్ లో అమెరికా సైనిక చర్యను నివారించడానికి ఖతార్, టర్కీ సహా అమెరికా ప్రాంతీయ మిత్రదేశాలు దౌత్య పరమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో త్వరలో టర్కీలో జరిగే సమావేశానికి ఈ మేరకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో అమెరికా పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా... ఖమేనీ తాజా హెచ్చరికలతో యుద్ధం విషయంలో బంతి అమెరికా కోర్టులో వేసినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News