పధకాలకు ఓట్లు రాలవు...అభివృద్ధికి దక్కవు !

చురుకుదనం తెలివి తేటలు అన్నవి రాజకీయ పార్టీలకు ఆయా నేతలకు ఉంటాయని ఒకప్పుడు అనుకునేవారు, ఇపుడు ఓటర్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ గానే ఉంటున్నారు.

Update: 2026-08-10 04:00 GMT

ఓటర్లు తీరు ఎపుడూ విలక్షణమే. వారు ఏమి అనుకుంటారో ఎవరికీ తెలియదు. ప్రతీ ఎన్నికకూ ఓటర్ల తీర్పు కూడా చాలా మారుతోంది. పైగా అయిదేళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో అదనంగా అయిదు శాతం యువ ఓటర్లు కూడా వచ్చి చేరుతున్నారు. వారి అభిప్రాయం కూడా మిక్స్ కావడంతో ఓటర్ల తీర్పు మీద ఎవరెంతటి వ్యూహకర్త అయినా రాజకీయ బహు మొనగాడు అయినా కూడా వేసుకున్న అంచనాలు తప్పుతున్నాయి. ధీమాలు కూడా తల్లకిందులు అవుతున్నాయి. నిజానికి దేశంలో చూస్తే అనేక రాష్ట్రాలలో ఇటీవల కాలంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

అనూహ్యంగానే :

దక్షిణాదినే తీసుకుంటే సొంత ఇల్లు కూడా లేకుండా ఎంతో నీతివంతంగా ప్రజల పక్షాన పాలన చేసిన కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ని ఇటీవల ఎన్నికల్లో జనాలు ఓడించారు. ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అయినా వద్దు అనేశారు. తమిళనాడులో చూసుకుంటే డీఎంకే ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఎన్నికల ముందు అయితే ఒక్కో తెల్ల కార్డు కుటుంబానికి ఆరు వేల రూపాయల దాకా ఆర్ధిక లబ్ది కలిగేలా పొంగల్ గిఫ్ట్ ని అందించింది. అభివృద్ధి విషయంలో ధీటుగానే ఉంది. అయినా ఆ పార్టీ ఓటమి చెందింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి చెందినా, ఒడిషాలో నవీన్ పట్నాయక్ పరాజయం పాలు అయినా ఓటర్ల విలక్షణత అని సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

తక్షణ పరిష్కారాలు :

ప్రజలు ఇపుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. తమకు అన్నీ తక్షణ పరిష్కారాలు కావాలని చూస్తున్నారు. దీర్ఘ కాల ప్రాజెక్టులు లాంగ్ టెర్మ్ బెనిఫిట్స్ అన్నవి పక్కన పెడుతున్నారు. అందుకే రాజకీయ పార్టీలు కూడా సంక్షేమానికి పెద్ద పీట వేయాల్సి వస్తోంది. అయినా సరే అయిదేళ్ళు గిర్రున తిరిగే సరికి మార్పు కావాలని జనాలు కోరుకుంటున్నారు. పధకాలు ఒక పార్టీ ప్రభుత్వం బాగా ఇచ్చినా మరో పార్టీ వస్తే ఇంతకు రెట్టింపు ఇస్తారు అన్న ఆశ కావచ్చు లేదా వారు ఏమి చేస్తారో అన్న కుతూహలం కావచ్చు పాత ప్రభుత్వాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఇక అభివృద్ధి విషయం తీసుకుంటే అది ప్రభుత్వాలు తలచుకుని పూర్తి చేయాల్సి వస్తోంది. వాటికి ఓట్లు పడుతున్నాయా అంటే లేదని జవాబు వస్తోంది.

సమిష్టి కంటే వ్యక్తిగానే :

గతంలో అయితే రాజకీయ పార్టీలు ఒక గ్రామానికి వెళ్తే అక్కడ చెరువుల అభివృద్ధికి రోడ్లకు కమ్యూనిటీ హాల్స్ కి నిధులు ఇస్తామని హామీ ఇచ్చేవారు. గెలిచాక అలా సామూహిక ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసేవారు. కానీ ఇపుడు అలా కాదు అంతా మారిపోయింది. సమిష్టి బదులుగా వ్యక్తి ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. నాకేమిటి అన్న ఆలోచన పెరుగుతోంది. దాంతో రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సి వస్తోంది. అందుకే సంక్షేమ పధకాలను కూడా వ్యక్తుల పేరు మీదనె కొనసాగించాల్సి వస్తోంది. ఇంత చేసినా గెలుపు గ్యారంటీ అయితే ఏ రాజకీయ పార్టీకి ఉండటం లేదు అనే అంటున్నారు.

అతి చురుకుదనమేనా :

చురుకుదనం తెలివి తేటలు అన్నవి రాజకీయ పార్టీలకు ఆయా నేతలకు ఉంటాయని ఒకప్పుడు అనుకునేవారు, ఇపుడు ఓటర్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ గానే ఉంటున్నారు. వారు స్మార్ట్ గానే ఆలోచిస్తున్నారు. దాంతో వారి ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా వ్యవహరించాల్సి వస్తోంది. ఇంకో వైపు చూస్తే వన్ టైం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అయిపోయారు. వచ్చేసారికి గెలుస్తామో లేదో అని దీపం ఉండగానే చక్కబెట్టుకునే బాపతు కూడా పెరిగిపోయారు. దాంతో జనాలకు ఎన్నుకున్న వారికి మధ్య గ్యాప్ పెరిగి అది అసంతృప్తికి దారి తీస్తోంది. ఇక ఎన్నికల వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం వల్ల కూడా రాజకీయ అవినీతి హద్దులు దాటుతోంది అని విశ్లేషణలు ఉన్నాయి.

మొహం మొత్తుతోంది అని :

ఇలా అన్ని వైపుల నుంచి కూడా విపరిణామాలు చోటు చేసుకోవడంతో అయిదేళ్ళకే పాలన పట్ల పాలకుల పట్ల పార్టీల పట్ల జనాలకు మొహం మొత్తుతోంది అని అంటున్నారు. దాంతో అతి తక్కువ చోట్ల మాత్రమే తప్ప మెజారిటీ స్టేట్స్ లో అయిదేళ్ళకు అధికారం చేతులు మారడం సాధారణం అయిపోయింది. ఈ విధానం మంచిదా చెడ్డదా అన్నది పక్కన పెడితే ప్రజల ఆలోచనలు రాను రానూ మరింతగా వేగవంతంగా దూకుడుగా ఉంటాయనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు, వాటిని తట్టుకుని నిలబడి వరసగా రెండోసారి గెలవడం అన్నది జరిగితే అది రాజకీయ అద్భుతంగానే చూడాల్సి ఉంటోంది.

Tags:    

Similar News