జనసేనకు నాలుగో మంత్రి....లెక్క అదేనా ?

ఇక ఉత్తరాంధ్రలో జనసేనను విస్తరించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రాకే నాలుగవ మంత్రి పదవి అని అంటున్నారు.

Update: 2026-08-10 03:59 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెండవ అతి పెద్ద మిత్ర పక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ 2024 ఎన్నికల్లో 21 సీట్లు మాత్రమే తీసుకుని పొత్తు ధర్మాన్ని పాటించి మరీ పోటీ చేసింది. అయితే మొత్తానికి మొత్తం సీట్లు గెలిచి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటుని జనసేన నమోదు చేసింది. ఇక 21 మంది ఎమ్మెల్యేలలో ముగ్గురికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానం దక్కింది. అంతే కాదు అయిదు ముఖ్యమైన పోర్టు ఫోలియోలు లభించాయి. ఆ తరువాత నాదెండ్ల మనోహర్ కి ముఖ్యమైన పౌర సరఫరాల శాఖ లభించింది. కందుల దుర్గేష్ కి పర్యాటక శాఖ ఇచ్చారు. పవన్ తో పాటు మిగిలిన ఇద్దరు జనసేన మంత్రులు కూడా తమ శాఖల విషయంలో పూర్తి సమర్ధంగా పనిచేస్తున్నారు అన్నది అయితే ఉంది.

విస్తరణలో చాన్స్ :

ఇక జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఉంది అని గుర్తు చేస్తున్నారు. గత ఏడాది నాగబాబుకు రాజ్యసభకు దక్కకపోవడంతో ఆయన్ని కేబినెట్ లో తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎపుడు మంత్రి వర్గ విస్తరణ జరిగినా కేబినెట్ లో మరో సీటు జనసేనదే అని అంటున్నారు. అంటే నాలుగవ మంత్రి జనసేన నుంచి ఉంటారు అన్న మాట. మరి ఆ మంత్రి పదవి ఎవరికి అన్న దాని మీదనే పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.

నాగబాబుకేనా :

పద్ధతి ప్రకారం అయితే నాగబాబుకు ఆ మంత్రి పదవి దక్కాల్సి ఉంది అని అంటున్నారు. ఆయన గత ఏడాది మార్చి 30న ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. ఆయన చట్ట సభలో సభ్యుడే కాబట్టి మంత్రి పదవికి అర్హుడే. మరి ఆయనకు హామీ మేరకు మంత్రి పదవి ఉంటుందా అన్నది ఆలోచిస్తున్నారు. అయితే నాగబాబుకు మంత్రి ఇస్తే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవి అన్న విమర్శలు వస్తాయని కూడా జనసేన ఆలోచిస్తోంది అని అంటున్నారు. అంతే కాకుండా జనసేన నుంచి ఇప్పటికే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మూడవ మంత్రి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు అయితే ఇబ్బంది వస్తుందని కూడా చర్చ ఉందిట. దాంతో ఇతర నేతల పేర్లు సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.

ఇద్దరి మధ్య పోటీ :

ఇక ఉత్తరాంధ్రలో జనసేనను విస్తరించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రాకే నాలుగవ మంత్రి పదవి అని అంటున్నారు. అది కూడా బీసీలకు ఇస్తారని కూడా వినిపిస్తోంది. మరి జనసేనకు ఉత్తరాంధ్రాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇద్దరు బీసీలు ఉన్నారు. వారే సీనియర్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అలాగే విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్. కొణతాల గవర సామాజిక వర్గానికి చెందిన వారు విశేష రాజకీయ అనుభవం కలిగిన వారు. నిదానస్తుడు, వ్యూహకర్త. అందువల్ల ఆయనకే ఎక్కువగా చాన్స్ ఉందని అంటున్నారు. అదే సమయంలో యువతకు చాన్స్ ఇవ్వాలనుకుంటే విశాఖ నగరంలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకి లక్కీ చాన్స్ దక్కుతుందని అంటున్నారు. విశాఖ నగరంలో పెద్ద సంఖ్యలో యాదవ సామాజిక వర్గం ఉన్నారు. దాంతో అది జనసేనకు కలసి వచ్చే పరిణామంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News