బాబుతో పెట్టుకుని.. ఆనాడు-ఈనాడు వైసీపీకి న‌ష్ట‌మే.. !

ఒక ఎదురు దెబ్బ మ‌నిషిని మారుస్తుంది. ఒక ఓట‌మి పార్టీల‌కు గుణపాఠం నేర్పుతుంది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాజ‌కీయ పార్టీల్లోనూ ఈ త‌ర‌హా మార్పు క‌నిపిస్తోంది.;

Update: 2026-02-02 02:45 GMT

ఒక ఎదురు దెబ్బ మ‌నిషిని మారుస్తుంది. ఒక ఓట‌మి పార్టీల‌కు గుణపాఠం నేర్పుతుంది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాజ‌కీయ పార్టీల్లోనూ ఈ త‌ర‌హా మార్పు క‌నిపిస్తోంది. చేసిన త‌ప్పులు చేయ‌రాద‌న్న గుణపాఠాన్ని పార్టీలు నాయ‌కులు నేర్చుకుంటున్నారు. కానీ, చిత్రంగా ఏపీలో ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ మాత్రం ఈ మార్పు దిశ‌గా అడుగులు వేయలేక పోతోంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఒక‌సారి జ‌రిగిన ఘోర ప‌రాభ‌వం నుంచి ఆ పార్టీ గుణ‌పాఠాలు నేర్చుకోలేక పోతోంది.

2019లో 151 స్థానాలు ద‌క్కించుకుని దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ. ఐదేళ్ల పాల‌నా కాలంలో మంచి చేసినా.. నిండు పాల‌కుండ‌లో చిన్న ఉప్పుగ‌ల్లు మాదిరిగా.. వైసీపీ నాయ‌కులు ఆ నాడు చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌లు.. ముఖ్యంగా నారా భువ‌నేశ్వ‌రని ల‌క్ష్యంగా చేసుకుని చేసిన దారుణ‌మైన వ్యాఖ్య‌లు.. ఆ పార్టీకి శాపంగా మారాయి. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకుంటే.. దానిని కూడా గేలి చేశారు. ఫ‌లితంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఐక్య‌త పెంచారు.

ఇది వైసీపీ ప‌త‌నానికి నాంది ప‌లికింది. అనంత‌రం.. గ‌త ఎన్నిక‌ల్లో 151 నుంచి 11 స్థానాల‌కు వైసీపీ ప‌డి పోయింది. దీంతో ఆ పార్టీలో భారీ మార్పు వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశించారు. కానీ, ఎక్క‌డా ఆ త‌ర‌హా మార్పు రావ‌డం లేదు. ఇంకా.. చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నంలోనే ఉన్నారు. రాజ‌కీయంగా ఆయ‌న‌ను టార్గెట్ చేయొచ్చు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. ఇరు పార్టీలు.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కావ‌డంతో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు చోటు పెట్టుకుండా.. రాజ‌కీయంగా విధాన ప‌ర‌మైన అంశాల‌ను టార్గెట్ చేసుకోవ‌చ్చు.

కానీ, తాజా పరిణామంలో మ‌రోసారి చంద్ర‌బాబు కుటుంబాన్ని ఆయ‌న మాతృమూర్తిని నోరు చేసుకోవ‌డం వంటివి.. ప్ర‌జ‌ల‌లో మ‌రోసారి వైసీపీని చుల‌కన చేస్తున్నాయి. చంద్ర‌బాబుతో పెట్టుకుని ఆనాడు అధికారం పోగొట్టుకున్నా.. పార్టీ నాయ‌కుల‌కు ఇంకా చ‌ల‌నం రాలేదా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు.. ఇప్పుడు అంతో ఇంతో త‌మ గ్రాఫ్ పెరిగింద‌ని భావిస్తున్న స‌మ‌యంలోనూ.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే అనేక అంశాలు ఉన్నా.. వాటిని వ‌దిలేసి.. బాబును టార్గెట్ చేయ‌డం ద్వారా.. వైసీపీ మ‌రింతగా ప్ర‌జ‌ల్లో మైన‌స్ అయింది. ఇక‌, ఈ పార్టీ ర‌ప్పా ర‌ప్పా.. పార్టీనే అనే మాట జోరుగా వినిపిస్తోంది.

Tags:    

Similar News