రాజకీయాల్లో 'కాస్లీ' ట్విస్ట్ : నామినేషన్ కోసం రూ. 8 కోట్ల పన్ను

బకాయిల చెల్లింపు విషయంలో ఊరట లభిస్తుందని నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి.;

Update: 2026-02-02 03:51 GMT

రాజకీయాల్లో అధికారం కోసం ఆరాటం సహజం.. కానీ ఆ అధికారం కోసం చట్టం ముందు మోకరిల్లక తప్పదని నిజామాబాద్‌లో జరిగిన తాజా ఘటన నిరూపించింది. ఏకంగా 17 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 8 కోట్ల ఆస్తి పన్ను బకాయిలను.. కేవలం ఒక నామినేషన్ కోసం మున్సిపల్ ఖజానాలో జమ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా రేసులో ఉన్న శమంత నరేందర్ రెడ్డికి ఒక చిక్కు వచ్చి పడింది. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి ప్రభుత్వ బకాయిలు ఉండకూడదు. అంటే, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 'నో డ్యూ సర్టిఫికేట్' తప్పనిసరి. నరేందర్ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌కు సంబంధించి 2009 నుండి పన్ను బకాయిలు ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా రూ. 8,16,65,000. ఈ బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని అధికారులు ఖరాకండిగా చెప్పడంతో వ్యవహారం కోర్టుకు చేరింది.

అర్ధరాత్రి వరకు హైకోర్టులో హైడ్రామా

బకాయిల చెల్లింపు విషయంలో ఊరట లభిస్తుందని నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. అయితే న్యాయస్థానం చట్టం పట్ల తన నిబద్ధతను చాటుకుంది. "పన్ను బకాయిలు చెల్లించకుండా నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం సమంజసం కాదు" అని స్పష్టం చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఆరు భారీ డిమాండ్ డ్రాఫ్ట్ల (డీడీఎస్) రూపంలో మొత్తం రూ. 8.16 కోట్లను మున్సిపల్ అధికారులకు అందజేశారు.

ప్రశ్నార్థకమైన యంత్రాంగం పనితీరు

ఈ ఘటన మున్సిపల్ ఖజానాకు లాభం చేకూర్చినప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తింది. సామాన్యుడికి ఒక రూలు.. సంపన్నుడికి ఒక రూలా? చిన్నపాటి పన్ను బకాయి ఉంటేనే సామాన్యుల ఇళ్ల ముందు నోటీసులు అతికించే అధికారులు.. 17 ఏళ్లుగా రూ. 8 కోట్లు వసూలు చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎన్నికలు వస్తేనే చట్టం గుర్తొస్తుందా? కేవలం నామినేషన్ అడ్డంకి లేకపోతే ఈ కోట్లు మున్సిపల్ ఖాతాలోకి చేరేవేనా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

రాజకీయ మైలేజీనా.. విమర్శల వర్షమా?

మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో తన భార్యను బరిలోకి దింపేందుకు నరేందర్ రెడ్డి ఇంతటి భారీ సాహసం చేశారు. అయితే, కేవలం పోటీ కోసం ఇంత మొత్తం చెల్లించిన వారు, రేపు ఎన్నికల ప్రచారంలో ఇంకెంత ఖర్చు చేస్తారనే చర్చ సామాన్య ప్రజల్లో మొదలైంది. ఇది ఆయనకు 'నిబద్ధత' కలిగిన నేతగా పేరు తెస్తుందో లేక 'ధనబలం' ఉన్న నేతగా విమర్శలకు గురిచేస్తుందో వేచి చూడాలి.

ఏది ఏమైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒకేసారి ఇంత భారీ మొత్తం పన్ను రూపంలో రావడం ఒక రికార్డు. రాజకీయాలు వ్యవస్థను ప్రభావితం చేసినా అంతిమంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News