అర్నాబ్ తో వివాదం.. రంగంలోకి దిగిన సీబీఎన్
ఇండిగో సంక్షోభం టీడీపీని చుట్టుముట్టడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు.;
ఇండిగో సంక్షోభం టీడీపీని చుట్టుముట్టడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవాలన్న ఆలోచనతో అధినేత పార్టీ అధికార ప్రతినిధులతో అత్యావసరంగా సమావేశమయ్యారు. ఇండిగో సంక్షోభంపై జాతీయ మీడియా చానల్ ఆర్ టీవీ డిబేట్ కు వెళ్లిన దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించారు. టీవీ డిబేట్లకు వెళ్లేటప్పుడు సరిగా సిద్ధమవ్వాలని, యథాలాపంగా చేసే వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ చేయొద్దని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఆర్.టీవీ డిబేట్ లో టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి అనాలోచితంగా చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదానికి, ఆర్.టీవీ జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామితో గ్యాప్ రావడానికి దారి తీసిందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
మీడియాతో మంచి సంబంధాలు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ వివాదానికి తక్షణం ముగింపు పలకాలని పార్టీ నేతలకు సూచించారు. దీపక్ రెడ్డి ఆర్.టీవీ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు తప్పేనని చెప్పిన చంద్రబాబు.. తన వ్యాఖ్యలను సమర్థించుకోడానికి మరో తెలుగు చానల్ లో జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామిపై విమర్శలు చేసి పరిస్థితిని మరింత దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి విషయాలలో పార్టీ అధికార ప్రతినిధులు చాలా అప్రమత్తంగా ఉండాలని, అనావసర వివాదాలు పెట్టుకోవద్దని సీఎం సూచించినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామితో మంచి సంబంధాలే ఉన్నాయని, ఇలాంటి వివాదాలతో ఆయనను టార్గెట్ చేయడం పార్టీకి శ్రేయస్కరం కాదని చంద్రబాబు హితవుపలికినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్.టీవీతో వివాదాన్ని తక్షణం పరిష్కరించుకుని, ఇంతకు ముందున్న సంబంధాలను పునరుద్దరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇకపై ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే వెంటనే తనను సంప్రదించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక చంద్రబాబు జోక్యంతో ఇండిగో సంక్షోభంపై ఆర్.టీవీతో మొదలైన వివాదానికి పుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు. కొద్దిరోజుల క్రితం జాతీయ మీడియా ఆర్.టీవీలో ఇండిగో సంక్షోభంపై డిబేట్ జరిగింది. ఈ డిబేట్ కు టీడీపీ తరఫున సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి హాజరయ్యారు. ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆ చర్చ జరిగింది. దీనిపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి తరఫున స్పందించాల్సిందిగా దీపక్ రెడ్డిని డిబేట్ వ్యాఖ్యాతగా ఉన్న ప్రముఖ జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి కోరారు.
అయితే మంత్రి రామ్మోహననాయుడు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాల్సివుండగా, మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారని, సంక్షోభం సర్దుమణుగుతోందని చెప్పారు. అయితే మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఏ హోదాతో జోక్యం చేసుకుంటారని జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. జరిగిన పొరపాటును గుర్తించకుండా దీపక్ రెడ్డి మళ్లీమళ్లీ మంత్రి లోకేశ్ పేరే చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా వైసీపీ ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ టీడీపీని అభాసుపాలు చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు దీపక్ రెడ్డి ఆ డిబేట్ తర్వాత కూడా తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఆర్.టీవీతో వివాదానికి దిగేలా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం, టీడీపీ ప్రతిష్ట మసకబారినట్లు విశ్లేషణలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగాల్సివచ్చిందని అంటున్నారు.