ఫాంహౌస్ మత్తు కేసు: పాత అలవాట్లపై కొత్త అనుమానాలు
హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్ డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.;
హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్ డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో జరిగిన ఈ పార్టీ, కేవలం ఒక విందు వినోదంలా కాకుండా అంతర్జాతీయ స్థాయి డ్రగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న వ్యవహారంగా మారుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులు ఈ కేసులో చిక్కుకున్న ప్రముఖుల "పాత అలవాట్లపై కొత్త అనుమానాలను" రేకెత్తిస్తున్నాయి.
ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
పోలీసులు ఈ పార్టీపై దాడి చేసిన సమయంలో పట్టుబడిన వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, అతని అత్యంత సన్నిహితుడు నమిత్ శర్మల రిపోర్టులు పోలీసులను ఆలోచనలో పడేశాయి.
నమిత్ శర్మ నమూనాల్లో ఏకంగా మూడు రకాల డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పుట్టా మహేష్ రక్త నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఆనవాళ్లు లభించాయి. పార్టీలో పాల్గొన్న మిగిలిన వారిలో మరో నలుగురికి కొకైన్ వినియోగం పాజిటివ్‌గా తేలింది.
మొత్తం 11 మంది అనుమానితుల్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు శాస్త్రీయంగా రుజువు కావడంతో "మేము ఏ తప్పూ చేయలేదు, కేవలం డిన్నర్ కోసమే వెళ్లాము" అన్న వారి వాదనలు పటాపంచలయ్యాయి.
డ్రగ్స్ లెక్కల్లో తేడాలు.. కౌశిక్ రవి స్టేట్‌మెంట్ వెనుక మిస్టరీ
ఈ కేసులో బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి పాత్ర కీలకంగా మారింది. ఇతనే డ్రగ్స్ సరఫరాదారుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో కౌశిక్ రవి ఇచ్చిన వాంగ్మూలంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాను శిమ్లా పర్యటనలో ఉన్నప్పుడు రూ. 15,000 వెచ్చించి కొకైన్ కొన్నానని కౌశిక్ తెలిపాడు. మార్కెట్ ధర ప్రకారం ఒక గ్రాము కొకైన్ రూ. 10,000 పలుకుతుండగా కౌశిక్ కనీసం 1.5 గ్రాముల కొకైన్ తెచ్చి ఉండాలి. సంఘటనా స్థలంలో కేవలం 0.26 గ్రాముల కొకైన్ మాత్రమే దొరికింది. ఆరుగురు వ్యక్తులు డ్రగ్స్ వాడిన తర్వాత కూడా ఇంత తక్కువ మొత్తం మిగలడం వెనుక రహస్యం ఏంటనేది పోలీసుల ప్రశ్న. అసలు కౌశిక్ తెచ్చిన డ్రగ్స్ మోతాదు ఇంకా ఎక్కువే ఉండి ఉంటుందని కేవలం శిమ్లా నుండే కాకుండా స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా కూడా డ్రగ్స్ సమకూర్చుకున్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
పాత అలవాట్లా? పార్టీ ప్రభావమా?
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. నిందితుల నమూనాల్లో ఒకేసారి వివిధ రకాల డ్రగ్స్ ఆనవాళ్లు లభించడం. సాధారణంగా ఒకే పార్టీలో ఇన్ని రకాల సింథటిక్ డ్రగ్స్ అందుబాటులో ఉండటం అరుదు. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నమిత్ శర్మ, పుట్టా మహేష్ వంటి వారు ఈ ఫాంహౌస్ పార్టీకి రావడానికి ముందే వేరే చోట డ్రగ్స్ తీసుకున్నారా? వారి శరీరంలో లభించిన అవశేషాల మోతాదును బట్టి, వీరికి మత్తుమందుల వినియోగం కొత్త కాదని, గత కొంతకాలంగా వీరు డ్రగ్స్‌కు బానిసలై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి గత చరిత్రను, గత కొన్ని నెలల్లో వీరు ఎక్కడెక్కడ పార్టీలకు వెళ్లారు అనే వివరాలను సేకరించే పనిలో ప్రత్యేక బృందాలు ఉన్నాయి.
నెట్‌వర్క్ ఛేదన దిశగా అడుగులు
హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగం కేవలం పబ్బులకే పరిమితం కాకుండా అత్యంత భద్రత ఉండే ప్రైవేట్ ఫాంహౌస్‌లకు పాకిందని ఈ ఘటన నిరూపిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు, సంపన్న కుటుంబాలకు చెందిన యువత ఇందులో ఉండటంతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేవలం వినియోగించిన వారిని మాత్రమే కాకుండా, వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన ముఠాను పట్టుకోవడానికి "చైన్ అనాలిసిస్" పద్ధతిని వాడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎందరు ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి.