ఆ ఇద్దరితో మోడీ...జగన్ ఆల్టర్నేషన్ చూడాల్సిందేనా ?

భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా వేదిక మీద జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు.

Update: 2026-08-02 03:37 GMT

భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా వేదిక మీద జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించుకుని రాగానే ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ అభిమానంగా కరచాలనం చేశారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పవన్ సైతం వేదిక మీద ప్రసంగం చేస్తూ మోడీని తిరుగులేని నాయకుడిగా అభివర్ణించారు. అంతే కాదు ఆయనను విమర్శించడం తగదని హితవు పలికారు

శభాష్ లోకేష్ అంటూ :

మరో వైపు చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న నరేంద్ర మోడీ లోకేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. బాగా పనిచేస్తున్నావ్ శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. గతంలో కూడా లోకేష్ భుజం తట్టి మోడీ ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. మోడీ పిలుపు మేరకు లోకేష్ తన కుటుంబంతో సహా ప్రధాని నివాసానికి వెళ్ళి కలసి వచ్చిన సందర్భమూ ఉంది. తాజాగా చూస్తే లోకేష్ ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని మోడీ సూచించడం విశేషం.

యువ నాయకత్వం వారే :

బీజేపీ పెద్దలు ఎపుడూ భవిష్యత్తు రాజకీయాల గురించి ఆలోచిస్తూంటారు. ఒక ఎన్నికతో ఒక సందర్భంతో వారి రాజకీయాలు పరిమితం కావు. నిరంతరం ఆ దిశగానే ఆలోచన సాగుతూ ఉంటుంది. ఏపీకి సంబంధించి బీజేపీ 2024 ఎన్నికల్లో కూటమిగా కట్టి గెలిచిన తరువాత అక్కడితో ఆగిపోవడం లేదు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో తరచూ పర్యటనలు చేస్తున్న మాదిరిగానే ఏపీలో కూడా మోడీ ఎక్కువగా వస్తున్నారు. వచ్చిన ప్రతీ సారీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. అదే సమయంలో ఆయన ముందు చూపుతో రాజకీయంగానూ ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు మిత్ర పక్షం జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ని అభిమానించి ఆదరిస్తూనే మరో మిత్ర పక్షం బలమైన పార్టీగా ఉన్న టీడీపీ నుంచి యువ మంత్రి నారా లోకేష్ ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. దాంతో బీజేపీ ఏపీకి యువ నాయకత్వంగా పవన్ లోకేష్ లను గుర్తించిందని అంటున్నారు.

కలసికట్టుగా :

ఇక భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా 2027లో పోలవరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి మోడీ వస్తున్నారు. 2028లో అమరావతి రాజధాని ఓపెనింగ్ కూడా ఆయన రానున్నారు. ఈ విధంగా ఏపీకి సంబంధించి బిగ్ ప్రాజెక్టులు గేమ్ చేంజర్ అనదగిన వాటిని మోడీ జాతికి అంకితం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్ వైబ్స్ ని పెంచేస్తున్నారు. అంతే కాకుండా కలసికట్టుగా మూడు పార్టీల కూటమి 2029 ఎన్నికల్లో తలపడడమే కాదు విజయం సాధించేలా కూడా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

జగన్ ప్లాన్ మార్చాల్సిందే :

ఈ నేపథ్యంలో వైసీపీ కూడా తన ప్లాన్ ని మార్చాల్సిందే అని అంటున్నారు. ఎలా అంటే ఏపీలో ఎన్డీయే అన్నది గట్టిగా ఉంది. అది విడిపోదు అన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. దాంతో జాతీయ స్థాయిలో మరో బలమైన ఆల్టర్నేషన్ గా ఉన్న ఇండియా కూటమి వైపు వైసీపీ మారాల్సిందే అని అంటున్నారు. అపుడే ఫైట్ గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. మోడీకి బీజేపీకి ఏపీలో ఎన్డీయే కూటమితో ఇబ్బందులు లేకపోగా ఎంతో సుఖంగా ఉంది. దాంతో పాటు యువ నేతలుగా పవన్ లోకేష్ లను మోడీ బీజేపీ ప్రోత్సహిస్తోంది. ఈ నేపధ్యంలో విపక్షంలోని వైసీపీ తమ ప్లాన్స్ ని మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు మరో మూడేళ్ళలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కాకపోతే బీజేపీకి రహస్య మిత్ర పక్షంగా నిందలు మోస్తూ ఉంటే జరగాల్సిన నష్టం భారీగానే ఉండొచ్చు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News