తెలంగాణకు అమెజాన్ బంపరాఫర్.. సీఎం రేవంత్ రెడ్డి ‘రైజింగ్ సమ్మిట్’ ఎఫెక్ట్

తెలంగాణలో ఏఐ క్లౌడ్ కంప్యూటరింగ్, డిజిటల్ ఇనఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ లను ప్రధాన వృద్ధి ఇంజిన్లుగా మార్చేదిశలో ఈ ఒప్పందం ముఖ్యపాత్ర పోషించనుంది.;

Update: 2025-12-12 14:00 GMT

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు రాగా, ప్రఖ్యాత సంస్థ అమెజాన్ ఏకంగా రూ.58 వేల కోట్లతో విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. ప్రభుత్వంతో ఎంవోయూ కూడా చేసుకుంది. నిజానికి, హైదరాబాద్‌లో అమెజాన్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ఉంది, దీనిని HYD13 అని పిలుస్తారు. ఇప్పుడు తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)’ హైదరాబాద్ లో భారీ స్థాయి క్లౌడ్ సెంటర్ విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం దశలవారీగా రూ.58 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు వచ్చిన పలు సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదర్చుకోడానికి ఆసక్తిగా ఉన్నాయి. దీనికి తాజా ఉదాహరణ అమెజాన్ ఎంవోయూ అంటున్నారు. ప్రభుత్వంతో అమెజాన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ తన డేటా సెంటర్ సామర్థ్యాన్ని వేగంగా విస్తరించేందుకు అవసరమైన భూమి, కరెంటు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సివుంటుంది. వచ్చే 14 ఏళ్లలో 58 వేల కోట్ల పెట్టుబడితో భారతదేశంలోని క్లౌడ్, ఏఐ, స్టార్టప్, ఎంటర్ప్రైజులు, ప్రభుత్వ సేవల వ్యవస్థను హైదరాబాదులో మరింత బలోపేతం చేయనుంది.

తెలంగాణలో ఏఐ క్లౌడ్ కంప్యూటరింగ్, డిజిటల్ ఇనఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ లను ప్రధాన వృద్ధి ఇంజిన్లుగా మార్చేదిశలో ఈ ఒప్పందం ముఖ్యపాత్ర పోషించనుంది. ఇక అమెజాన్ తో ఒప్పందం కుదరడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణపై అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు నమ్మకం పెట్టడం గర్వకారణం’ అని సీఎం వ్యాఖ్యానించారు. అమెజాన్ భారీ పెట్టుబడి కాంగ్రెస్ సర్కారు పాలన, స్థిరత్వానికి తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యాల పట్ల నమ్మకాన్ని కలిగించిందని సీఎం అన్నారు. ఇక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం అమెజాన్ భారీ పెట్టుబడి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్ విస్తరణతో హైదరాబాద్ దేశానికి డేటా సెంటర్ రాజధానిగా మారుతుందని అన్నారు.

2030 నాటికి భారత్ లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అంటే దాదాపు రూ.3.15 లక్షల పెట్టుబడులు పెట్టే వ్యూహంతో అమెజాన్ పనిచేస్తోంది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అమెజాన్ ప్రకటించింది. అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒక్కటే భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. క్విక్ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ (ఏఐ)లో వ్యాపారాన్ని విస్తరించడం కోసం వీటిని వినియోగించనుంది. ఇక ఈ పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారత్ లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని తెలిపింది. వాల్మార్ట్ కు చెందిన ప్లిప్ కార్ట్ తోపాటు దేశీయ సంస్థలైన జియోమార్ట్, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, జెప్టోలకు పోటీనివ్వడం కోసం అమెజాన్ మన దేశంలో పెట్టుబడులు పెంచుతోంది.

Tags:    

Similar News