పవన్ కు 11వ స్థానం.. వైసీపీ ట్రోలింగ్ కు చాన్స్ ఇచ్చిన సీఎం!
ఈ సందర్భంగా ఫైళ్ల క్లియరెన్సు విషయంలో మంత్రులు, కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు ఎన్ని రోజులు తీసుకుంటున్నారనే విషయమై ఒక లిస్టు ప్రకటించారు.;
మంత్రులు, ఐఏఎస్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ పై వైసీపీ సెటైర్లు వేస్తోంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు దాడి చేస్తోంది. పవన్ గన్నవరం, మాధాపూర్ తిరగడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, ఇక ఆయన ఫైళ్లు క్లియర్ చేయడానికి సమయం ఎక్కడుంది అంటూ వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి చేసిన విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ఫీల్ అవుతారనే 11వ ప్లేస్ ఇచ్చారని వ్యాఖ్యానించడం ద్వారా, డిప్యూటీ సీఎం చాలా ఘోరంగా పనిచేస్తున్నారన్నట్లు వైసీపీ విమర్శలు చేస్తోంది.
గత 18 నెలలుగా వైసీపీ ఎప్పుడూ మంత్రులపై ఇలాంటి ఆరోపణలు చేయలేదని అంటున్నారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగును చాకచక్యంగా వాడుకుంటున్న వైసీపీ మంత్రులపై విమర్శలు ఎక్కుపెడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరో రాసిన స్ట్రిప్టు చదవడం, వైసీపీ అధినేత జగన్ ను తిట్టడంలో పవన్ బిజీగా ఉన్నారని, అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం అన్నయ్య చిరంజీవిని తిట్టినా ఆయన స్పందిచడం లేదని వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి ఇచ్చిన ర్యాంకింగులను హైలెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు ఎవరూ సరిగా పనిచేయడం లేదని ప్రచారం చేయడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
రెండు రోజుల క్రితం ప్రభుత్వ శాఖ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫైళ్ల క్లియరెన్సు విషయంలో మంత్రులు, కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు ఎన్ని రోజులు తీసుకుంటున్నారనే విషయమై ఒక లిస్టు ప్రకటించారు. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ శాఖ పరిధిలో ఫైళ్లు క్లియర్ చేయడానికి గరిష్టంగా మూడు రోజుల సమయం తీసుకుంటుండగా, డిప్యూటీ సీఎం పవన్ నాలుగు రోజులు టైం తీసుకుంటున్నారు. అయితే ఈ జాబితాలో తొలి స్థానంలో మంత్రి డోలా బాల వీరాంజనేయుస్వామి నిలిచారు. చంద్రబాబు ఆరోస్థానం, లోకేశ్ 9వ స్థానంలో నిలిచారు. పవన్ కు 11వ స్థానం ఇచ్చారు. అయితే చంద్రబాబు, లోకేశ్ లను వదిలేసిన వైసీపీ ఉపముఖ్యమంత్రి పవన్ ను మాత్రం టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
గత కొంతకాలంగా పవన్, లోకేశ్ పర్యటనపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. వారం వారం హైదరాబాద్ వెళ్తున్న ఇద్దరు నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ప్రచారం చేస్తోంది. విపక్షం చేస్తున్న ఈ విమర్శలను కూటమి నేతలు సమర్థంగా తిప్పికొడుతున్నా, వైసీపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏ అవకాశం వచ్చినా పవన్ పర్యటనలను హైలెట్ చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. ఇలా పవన్ ను డ్యామేజ్ చేయడం వల్ల రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని వైసీపీ ఆశిస్తోందని అంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎంపై పనితీరుపై ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలను వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళుతోంది.