కొలికపూడి ‘స్టేటస్’ మారలేదు.. టీడీపీ ఏం చేయలేదన్న ధీమానే కారణమా?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదానికి తెరలేపారు. తాజాగా పార్టీ మండలశాఖ అధ్యక్షుడిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారు.;
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదానికి తెరలేపారు. తాజాగా పార్టీ మండలశాఖ అధ్యక్షుడిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారు. తన వాట్సాప్ స్టేటస్ లో విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు వైఖరిని ప్రశ్నించారు. ‘‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్ కా? జూదం కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’’ అంటూ స్టేటస్ పెట్టిన ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ కార్యకర్తల్లో దుమారం రేపారు. ఈ విషయమై ఎమ్మెల్యే కొలికపూడిని మీడియా ప్రశ్నిస్తే, తన పార్టీకి చెందిన రాయల సుబ్బారావు చాలా కాలంగా జూదం ఆడిస్తున్నట్లు ఆరోపించారు.
తాజా వ్యవహారంతో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలి మరోమారు చర్చకు తావిచ్చింది. ఇప్పటికే పలు వివాదాలతో టీడీపీకి ఎమ్మెల్యే తలనొప్పిగా మారారు అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి అక్టోబరులో పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టారు. ఈ వవ్యహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయి ఆయన వివరణ తీసుకోవాలని క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. అధినేత సూచనలతో క్రమశిక్షణ సంఘం ఎంపీ, ఎమ్మెల్యేలను విచారించింది. ఎమ్మెల్యే కొలికపూడిదే తప్పని నిర్ధారించడమే కాకుండా, ఆయనపై చర్యలకు సిఫార్సు చేస్తూ అధినేతకు నివేదిక సమర్పించింది.
ఇక క్రమశిక్షణ సంఘం సిఫార్సులు అంది దాదాపు నెల రోజులైనా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో తానేం చేసినా పార్టీలో చర్యలు ఉండవు అన్న ధీమాతో కొలికపూడి నడుచుకుంటున్నారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుసటి రోజు నుంచే కొలికపూడి దూకుడుతో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఎంపీ వరకు ప్రతి ఒక్కరితోనూ వివాదాలు పెట్టుకుంటున్న కొలికపూడి.. నియోజకవర్గంలో పార్టీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
గతంలో మద్యం బెల్టు షాపులు నడుస్తున్నాయని, మద్యం బాటిళ్లను చూపుతూ నానా అల్లరి చేశారు కొలికపూడి. అదేవిధంగా మహిళా కార్యకర్తలతో దురుసు ప్రవర్తన, కార్యకర్తలు, మీడియాపై వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో వేగలేకపోతున్నామని పార్టీ కేడర్ మొత్తం అధిష్టానం వద్ద మొత్తుకుంటున్నా, చర్యలు తీసుకోకపోవడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఎవరూ లేనట్లు పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో కొలికపూడి ఒక్కరే వివాదాస్పద వైఖరితో అటు కార్యకర్తలను, ఇటు అధిష్టానాన్ని విసిగిస్తున్నారు. అయితే ఆయనపై చర్యలు విషయంలో పార్టీ అధిష్టానం మెతకగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యే స్వపక్షంలో విపక్షంగా మారిపోయి పార్టీ పరువు బజారు కీడిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు.