వ్యక్తిత్వ పరిరక్షణ.. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించడం వెనుక కారణం?
మరికొంతమంది ఫోటోలను ఉపయోగించి అసభ్యకర వీడియోలు తయారు చేస్తూ వాటిని ఇంటర్నెట్లో పెడుతున్న విషయం తెలిసిందే.;
గత కొంతకాలంగా టాలీవుడ్ ను మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతోమంది సెలబ్రిటీలను, సినీ ప్రముఖులను అలాగే రాజకీయ నాయకులను కూడా కొంతమంది టార్గెట్ చేస్తూ.. వారి డీప్ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న విషయం తెలిసిందే .ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను దుర్వినియోగపరచడమే కాకుండా వీరి అనుమతి లేకుండానే.. వీరి ఫోటోలను ఉపయోగించడం.. బహిరంగంగా వీరి ఫోటోలను ఉపయోగించి ఫేక్ వస్తువులను మార్కెట్లో విక్రయించడం లాంటివి చేస్తూ.. సెలబ్రిటీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారు.
మరికొంతమంది ఫోటోలను ఉపయోగించి అసభ్యకర వీడియోలు తయారు చేస్తూ వాటిని ఇంటర్నెట్లో పెడుతున్న విషయం తెలిసిందే. అలా కొంతమంది ఆకతాయిల వల్ల మరికొంతమంది వ్యక్తుల వల్ల సెలబ్రిటీల పరువుకు, వ్యక్తిత్వ హననానికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలోనే ఇలాంటివి జరగకుండా చాలామంది సెలబ్రిటీలు ముందస్తుగానే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
అందులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి హీరోలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా..ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.. ఒకవైపు హీరోగా.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఈయన తాజాగా తన వ్యక్తిగత పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.తమపై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు, అనవసర వ్యాఖ్యలు చేయకుండా తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూడాలి అని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా చూడాలని కోర్టును కోరారు. అంతేకాదు ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా తమ పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇలా టాలీవుడ్ హీరోలందరూ కూడా వ్యక్తిగత పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో ఎందుకు ఢిల్లీ హైకోర్టుని టాలీవుడ్ సెలబ్రిటీలు ఆశ్రయిస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టుకే వెళ్లడానికి ప్రధాన కారణం కాపీరైట్, ఐటీ, పర్సనాలిటీ రైట్స్ వంటి జాతీయస్థాయి వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు దేశం మొత్తం వర్తించడం వంటి కారణాల వల్లే ఇప్పుడు టాలీవుడ్ హీరోలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతోనే ఈ అనుమానాలు వ్యక్తం అవ్వగా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ఇకపోతే టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలైన ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ , అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్ , కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.