ఎవరీ కనికెళ్ల మాధురి.. ఎందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు?

Update: 2020-06-04 05:00 GMT
మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏపీలోని ఒక డిప్యూటీ కలెక్టర్ ను పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న కనికెళ్ల మాధురిని విజయవాడలోని ఆమె ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను గుంటూరుజిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకీ ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? ఆమె ఏం చేశారని ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాల భూమిని సమీకరించటం తెలిసిందే. ఇందులో భాగంగా తూళ్లురు మండలం నెక్కల్లులో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అనుచరుడు రావెల గోపాలకృష్ణ ఒకరు. అతగాడు ల్యాండ్ పూలింగ్ కు 3.11 ఎకరాలు ఇచ్చినట్లు చూపించారు.

దీనికి బదులుగా 3,110 చదరపు గజాలున్న ఎనిమిది నివాస ప్లాట్లు.. 770 చదరపు గజాలున్న రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్ డీఏ ద్వారా కేటాయించారు. అయితే.. ఆ భూమి నాగార్జునసాగర్కాలువ.. రెండు రోడ్లకు చెందినది. అలాంటి భూమిని ప్రైవేటు ఆస్తిగా చూపించి భూమిని కేటాయించేలా చేశారు. ఆ క్రమంలో తానుచేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేసినట్లుగా మాధురి మీద ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించటంతో పాటు.. రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. ఈ మొత్తం గుట్టును తాజాగా పోలీసులు రట్టు చేయటంతో మాధురి చేసిన తప్పులు తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె చేసింది తప్పా? రైటా? అన్నది కోర్టు తేల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటివరకూ అధికారుల వాదనే తప్పించి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి నోరు విప్పలేదు. ఆమె వాదన బయటకు రాలేదు. దీంతో.. ఆమె ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News