వారి కోపంతో కోక్.. పెప్సీలకు వణుకు

Update: 2017-01-21 06:32 GMT
తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టు మీద నిషేధం విధించిన వైనంపై తమిళులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు భారీగా సాగుతూ.. యావత్ తమిళనాడు మొత్తం అతలాకుతలమవుతోంది. తమిళలలో పెల్లుబుకిన ఆగ్రహావేశాలకు కేంద్రం సైతం ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. తమిళులు డిమాండ్ చేస్తున్నట్లుగా బ్యాన్ కు చెక్ పెట్టే ఆర్డినెన్స్ ను యుద్ధప్రాతిపదికన తయారు చేయటం తెలిసిందే.

ఇదిలాఉంటే.. జల్లికట్టుపై నిషేధం విధించేందుకు కారణమైన పెటా సంస్థపై తమిళులు సరికొత్త యుద్ధాన్ని షురూ చేశారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా పరిస్థితి మారింది. తమకింత కష్టాన్ని తీసుకొచ్చిన పెటా స్వచ్చంద సంస్థ అమెరికాదన్న విషయాన్ని చెబుతూ పలువురు తమిళులు.. అమెరికాకు చెందిన పెప్సీ.. కోక్ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని డిసైడ్ చేశారు.

తమను ఇంత వేదనకు గురి చేస్తున్న పెటా సంస్థఅమెరికాది కావటం.. ఆ సంస్థకు నిధులు అందిస్తాయన్న పేరున్న పెప్సీ.. కోక్ లకు వ్యతిరేమన్న విషయాన్ని వారు తెలియజేయటమే కాదు.. వాటి ఉత్పత్తుల్ని వినియోగించకుండా ఉండటం ద్వారా వాటిని ఆర్థికంగా దెబ్బ తీయాలన్న వాదననుపలువురు చేస్తున్నారు. ఈ వాదనల్ని విన్న తమిళ వ్యాపారులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

తమ సంప్రదాయాల్ని.. సంస్కృతిని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న పెటా కు ఆర్థికంగా సాయంగా నిలిచే పెప్సీ.. కోకోకోలా ఉత్పత్తుల్ని అమ్మకూడదన్న నిర్ణయానికి వచ్చాయి. తాజా నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా.. కోక్.. పెప్సీ అమ్మకాల్ని షాపుల వారు స్వచ్ఛందంగా అమ్మకూడదని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. దీంతో.. కోక్.. పెప్సీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఓ విషయం ఎక్కడో మొదలై.. మరెక్కడో ఆగటం అంటే ఇదేనేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News