టాప్ సీక్రెట్ : ప్రపంచబ్యాంక్ ప్రతినిధులను అవమానించిన సీఎంవో సిబ్బంది!

Update: 2019-07-18 04:13 GMT
ఒకవైపు ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి తను పెట్టుకున్న టార్గెట్ కోసం గట్టిగా కష్టపడుతూ ఉన్నారు. ఆరు నెలల్లోనో, సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని ప్రకటించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా తన ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.

అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేందుకు జగన్ శతథా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల ఆలోచనలు, అమలు విషయంలో జగన్ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

మరోవైపు పాలన విషయంలో కూడా జగన్ గట్టిగా కృషి చేస్తున్నారు. అధికారులతో పని చేయించుకోవడం విషయంలో కూడా బెటర్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు జగన్. అనవసరమైన సమీక్షలు లేకుండా, అవసరమైన విషయాల్లో మొహమాటాలు లేకుండా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పటికే జగన్ కింది వారిలో కొంత కో ఆర్డినేషన్ లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. సెక్రటేరియట్ లోనే అలాంటి పరిస్థితి కనిపించడం గమనార్హం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకున్నట్టుగా సమాచారం.

జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి ఏపీ సెక్రటేరియట్ కు రాగా వారికి అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని సమాచారం. వారిని రిసీవ్ చేసుకోవడంలో అధికారులు సరిగా వ్యవహరించలేదని తెలుస్తోంది. వచ్చింది ప్రపంచ బ్యాంక్ బృందం అయినా వారికి వెల్కమ్ చెప్పిన వారు లేరట. అంతేగాక వారిని మొదట లోపలకు రానీయలేదని తెలుస్తోంది. చివరకు నానా తంటాలు పడి వాళ్లు లోపలకు వెళ్లాల్సి వచ్చిందట. ఇలాంటివి అంత మంచిది కాదని పరిశీలకులు అంటున్నారు.

ఎవరితో ఎలా వ్యవహరించాలనే విషయంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులు, సచివాలయ సిబ్బంది మరి కాస్త స్పష్టత తెచ్చుకుని వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
Tags:    

Similar News