ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త పరిణామం
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా అలియాస్ రోజాను విచారణకు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.;
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన ఒక హత్య కేసుకు సంబంధించి తాజాగా కొత్త కోణాన్ని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ దుర్మార్గానికి సంబంధించిన కేసులో కొత్త కోణం వెలుగ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య ఉదంతంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణలో భాగంగా కొత్త విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించగా.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు కనిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. సుబ్రహ్మణ్యం హత్యకు కాసేపు ముందు.. తర్వాత ఎవరితో కలిశారన్నది గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా అలియాస్ రోజాను విచారణకు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం లీక్ కావటంతో ఆమె అండర్ గ్రౌండ్ లోకి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.
ఆమెను విచారించేందుకు నోటీసులు ఇచ్చే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రెవెన్యూ సిబ్బంది లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో కీలకమైన సాంకేతిక అంశాలు లభించాయని.. ఈ కేసుకు బలమైన ఆధారాలుగా మారతాయన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్టు తప్పదన్న భయంతోనే కోర్టును ఆశ్రయించినట్లుగా సమాచారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య ఉదంతం చోటు చేసుకోవటం.. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. అయితే.. అప్పట్లో ఈ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ అనంతబాబు తర్వాత బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఈ కేసు విచారణ కోసం డిమాండ్ చేయటంతో పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి సంచలన పరిణామాలు వెలుగు చూసే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.