బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు.. యూకే ప్రధాని ఆందోళన ఇదే!

అవును.. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా మూకలు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-31 09:56 GMT

మొన్న దీపూ చంద్రదాస్.. ఆ తర్వాత అమృత్ మండల్.. తాజాగా బజేంద్ర బిశ్వాస్.. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులను వరుసగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హిందూ కుటుంబాలకు సంబంధించిన పలు ఇళ్లకు నిప్పు పెట్టారు.. వారి పెంపుడు జంవుతులను దహనం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారని అంటున్నారు. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది.. దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

ఈ సంఘటనలపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. దీపూ చంద్ర దాస్ మృతికి కారణమైన పలువురుని అరెస్ట్ చేశామని చెబుతోంది తప్ప.. ఇలాంటి ఘటనలు జరగకుండా చేతల్లో తీసుకున్న చర్యలు ఏమిటో మాత్రం వెల్లడించడం లేదు. పైగా అక్కడ హిందువుల పరిస్థితి రోజు రోజుకీ తీవ్ర ఆందోళనగా మారుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై యూకే ప్రధాని స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా మూకలు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. కుక్కను చంపాలనుకుంటే దానికి పిచ్చిది అని ముద్ర వేసినట్లుగా... హిందువులపై దైవదూషణ ఆరోపణలు చేసి, ఆ మాటున వారిపై దాడులు చేస్తున్నారని అంటున్నారు! ఈ నేపథ్యంలో యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీపూ చంద్రదాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ ల హత్యలకు ఖండిస్తూ వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈ ఏడాది నవంబర్ లో తమ మంత్రి జెన్నీ చాప్ మన్.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ రాజకీయ సలహాదారు ముహమ్మద్ యూనస్ ను కలిసిన సమయంలో కూడా ఆ దేశంలో మైనారిటీల రక్షణ అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. మానవ హక్కులను రక్షించడంలో బంగ్లాదేశ్ కు బ్రిటన్ మద్దతు కొనసాగుతుందని హామీ ఇస్తూ... ప్రజల మత స్వేచ్ఛ, విశ్వాసాలను కాపాడటానికి యూకే ప్రభుత్వం కట్టుబడి ఉందని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో... అత్యంత పాశవికంగా హత్య చేయబడిన దీపూ చంద్రదాస్ కేసులో బంగ్లాదేశ్‌ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు.

కాగా... ఇటీవల బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక వాక్ చాతుర్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడున్న హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా... దైవ దూషణ ఆరోపణలతో ఇటీవల దీపూ చంద్రదాస్‌ అనే హందూ వ్యక్తిపై అల్లరిమూకలు దాడి చేసి, అత్యంత పాశవికంగా హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని చెట్టుకు వేళాడ దీసి నిప్పు పెట్టిన పరిస్థితి. దీనిపై భారత్ లో తీవ్ర నిరసనలు చెలరేగాయి.

అనంతరం జరిగిన మరో ఘటనలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో అమృత్‌ మండల్‌ అనే మైనారిటీ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఇక తాజాగా... మంగళవారం బజేంద్ర బిశ్వాస్‌ అనే మరో హిందువుని అతడి సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ నేపథ్యంలోనే యూకే ప్రధాని స్పందిస్తూ... ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News