వంశీ కోసం పోలీసుల గాలింపు.. మళ్లీ అరెస్టు తప్పదా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీమోహన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.;
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీమోహన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నారని, మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు భయంతో తప్పించుకుతిరుగుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడైన వంశీ 137 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జైలులో ఉండగా అనారోగ్యానికి గురైన వంశీ బరువు తగ్గిపోవడంతోపాటు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ కేసు నమోదు అవడం.. ఇవి కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడకు చెందిన సునీల్ అనే యువకుడిపై వంశీ అనుచరులు దాడి చేశారని, వంశీ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మాచవరం పోలీసుస్టేషన్ లో ఈ నెల 17న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు వంశీతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని అంటున్నారు. దీంతో నిందితులను మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో హత్యాయత్నం కేసు నమోదు చేసిన తర్వాత వంశీ కనిపించకుండా పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో వారెంట్ ఇచ్చేందుకు 23న పోలీసులు వంశీ ఇంటికి వెళ్లారని, ఆయన అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆ తర్వాత 29న సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వాయిదాకు విజయవాడ కోర్టుకు వంశీ రావాల్సివుండగా, అరెస్టు భయంతో గైర్హాజరయ్యారని అంటున్నారు. మాచవరం పీఎస్ లో కేసు నమోదు తర్వాతే ఈ పరిణామాలు జరగడం, వంశీ కనిపించకుండా తిరగుతుండటంతో మాజీ ఎమ్మెల్యేను మళ్లీ అరెస్టు చేస్తారా? అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
విజయవాడ కోర్టుకు వంశీ గైర్హాజరు అయిన విషయం మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అరెస్టు భయం కారణంగానే వంశీ కోర్టుకు రాలేదంటూ ఓ సెక్షన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండిస్తూ వంశీ తరఫున ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడంతో ఆయన అండర్ గ్రౌండుకు వెళ్లారనే అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు. ఇక రెండు రోజుల క్రితం ఆయన కోర్టుకు రాకపోవడంతో మాచవరం పీఎస్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని అంటున్నారు. ఇదే సమయంలో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో వంశీ అరెస్టుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా పరిణామాలతో ప్రభుత్వ పెద్దలకు వంశీపై ఇంకా ఆగ్రహం చల్లారలేదా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో 11 కేసులు నమోదు చేయడంతోపాటు 137 రోజుల పాటు జైలులో పెట్టారని, ఈ కేసులతో వంశీ పూర్తిగా లొంగిపోయినట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. అయితే గతంలో వంశీ వ్యవహరించిన తీరు కారణంగా ఆయనపై ప్రభుత్వ పెద్దలకు కోపం తగ్గలేదని టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు వస్తున్నాయి. దీంతో రెండో సారి వంశీ అరెస్టు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు కోర్టు మాత్రమే రక్షణ కల్పించగలదని వ్యాఖ్యానిస్తున్నారు.