భోగాపురం విమానాశ్రయం రెడీ.. జనవరి 4న కీలక పరీక్ష

ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ నుంచి తొలి విమానం ఎగరడానికి ముహూర్తం కూడా ఖరారైంది.;

Update: 2025-12-31 11:00 GMT

ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ నుంచి తొలి విమానం ఎగరడానికి ముహూర్తం కూడా ఖరారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో కాంట్రాక్టు సంస్థ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ యాజమాన్యం స్థానికులే కావడం, కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతీయుడే కావడంతో రికార్డు సమయంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేశారని అంటున్నారు.

నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో జనవరి 4న టెస్ట్ ప్లైట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది. 2025 మే నెలలో విమానాలు రాకపోకలు సాగించేలా పనులు చేశారు. ప్రస్తుతం అన్ని పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు చెబుతున్నారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగిరేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు జనవరి 4న తొలి టెస్టింగ్ విమానం ఎయిర్పోర్టులో దిగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత విమానం ఎగరనున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఇప్పటికే పూర్తయిన రన్ వేపై చిన్నచిన్న విమానాలను పరీక్షించారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థ జీఎంఆర్ ధ్రువీకరించడం లేదు. కానీ, ఈ సారి టెస్టింగ్ ఫ్లైట్ జనవరి 4న ఉంటుందని అధికారికంగా ప్రకటించడం విశేషం. పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫ్లైట్ టెస్టింగ్ ఉంటుందని చెబుతున్నారు. 2014-19 మధ్య కాలంలో ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.

అప్పట్లోనే భూములను సమీకరించి, శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభమయ్యే సరికి ఎన్నికలు రావడంతో చాలాకాలం విమానాశ్రయ నిర్మాణం ముందుకు సాగలేదు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై చొరవ చూపింది. కొన్ని మార్పులు చేసి నిర్మించాలని చూసింది. అయితే నిర్మాణ పనుల్లో విపరీత జాప్యం కారణంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ముందుకు కదల్లేదని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయింది.

విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వారం, పది రోజులకు ఒకసారి ఆయన విమానాశ్రయాన్ని సందర్శిస్తూ పనుల పురోగతి దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత మంచిది అన్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తూ కాంట్రాక్టు సంస్థ వెంటపడింది. విశాఖ అభివృద్దికి భోగాపురం విమానాశ్రయం గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.

Tags:    

Similar News