కల్తీ నెయ్యి కేసులో టీడీపీ ఎమ్మెల్యే.. కీలక మలుపు!

ఈ కారణంగానే మంగళవారం సీబీఐ సిట్ అధికారులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విచారించి ఆమె సాక్ష్యాన్ని నమోదు చేసినట్లు చెబుతున్నారు.;

Update: 2025-12-31 10:34 GMT

కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు ప్రతిపక్ష వైసీపీ నేతలు, వారి అనుచరుల చుట్టూ తిరిగిన ఈ కేసులో తొలిసారి అధికార టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి విచారణ ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా పనిచేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మంగళవారం సీబీఐ సిట్ విచారించడం చర్చనీయాంశం అవుతోంది. అప్పట్లో పాలక మండలి సభ్యురాలిగా ఉన్న ప్రశాంతిరెడ్డి నాలుగు నెలపాటు టీటీడీ పర్చేజ్ కమిటీలో పనిచేశారని అంటున్నారు. దీంతో ఆమె ఇచ్చే వివరాలు, వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతిరెడ్డి ఇప్పటికీ టీటీడీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టీటీడీలో సభ్యురాలిగా ఉండటంతో ఆమె వాంగ్మూలానికి ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు. ఈ కారణంగానే మంగళవారం సీబీఐ సిట్ అధికారులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విచారించి ఆమె సాక్ష్యాన్ని నమోదు చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి నెల్లూరు వచ్చిన సిట్ అధికారులు రోజంతా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నుంచి వివరాలు తెలుసుకుని ఆమె వాంగ్మూలం నమోదు చేశారని అంటున్నరు. వైసీపీ అధికారంలో ఉండగా, టీటీడీ సభ్యురాలుగా పనిచేసిన ప్రశాంతిరెడ్డి కొన్నాళ్లు కొనుగోలు కమిటీలో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.

దీంతో కొనుగోళ్ల కమిటీ విధులు, బాధ్యతలు, పనిచేసే విధానంపై సిట్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో నెయ్యి కల్తీ విషయం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి వచ్చింది? లేనిది? కూడా తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చెప్పిన అన్ని అంశాలను నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. పర్చేజ్ కమిటీలో 4 నెలలు పనిచేసినా తనకు కొనుగోళ్ల వివరాలు ఏవీ పెద్దగా తెలియవని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీబీఐ సిట్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆరున్నరేళ్ల క్రితం జరిగిన అంశాలు తనకు గుర్తు లేవని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారని అంటున్నారు.

ఇక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచారణతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. బయటకు చెప్పకపోయినా సీబీఐ సిట్ కు కావాల్సిన సమాచారం ఎమ్మెల్యే ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. విపక్షానికి చెందిన టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఇదే కేసు విషయమై గతంలో సీబీఐ విచారించింది. అయితే వారు తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సిట్ అధికారులు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చే వాంగ్మూలం కేసు దర్యాప్తులో సీబీఐ సిట్ కు ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామం విపక్ష శిబిరంలో వాడివేడి చర్చకు కారణమైంది. విపక్షంలో ఎవరినైనా కార్నర్ చేసేలా ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ద్వారా స్కెచ్ వేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News