రహస్యంగా మునీర్ మూడో కుమార్తె పెళ్లి.. యూఏఈ ప్రెసిడెంట్ వచ్చిన రోజే కానీ..!
అవును... పాకిస్థాన్ అనధికారిక నియంతగా పేరు తెచ్చుకున్న ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసిమ్ మునీర్ కుమార్తె వివాహం ఇటీవల అత్యంత రహస్యంగా జరిగిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.;
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎస్) జనరల్ అసిమ్ మునీర్ కుమార్తె మహనూర్ వివాహం అత్యంత రహస్యంగా జరిగిందనే విషయం తాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. తనకు అత్యంత దగ్గరి బంధువు అయిన అబ్దుల్ రెహ్మాన్ తో డిసెంబర్ 26న ఈ వివాహం జరిగిందని అంటున్నారు. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వివాహానికి.. దేశంలోని అగ్ర రాజకీయ నాయకులు, సైనిక ప్రముఖులు హాజరయ్యారని చెబుతున్నారు.
అవును... పాకిస్థాన్ అనధికారిక నియంతగా పేరు తెచ్చుకున్న ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసిమ్ మునీర్ కుమార్తె వివాహం ఇటీవల అత్యంత రహస్యంగా జరిగిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉన్నంతలో తక్కువ మంది అతిథులతో జరిగినట్లు చెబుతున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటివి ఏవీ బయటకు రాలేదు. స్థానిక జర్నలిస్టు జాహిద్ గిష్కోరి ఒక వీడియోను పోస్ట్ చేసిన కాసేపటికే దాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో... పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్, ఐఎస్ఐ చీఫ్, పాకిస్తాన్ సైన్యంలోని ఇతర సభ్యులు, రిటైర్డ్ జనరల్స్, మాజీ చీఫ్ లు హాజరయ్యారని చెబుతున్నారు. అసిమ్ మునీర్ కొత్త అల్లుడు అబ్దుల్ రహ్మాన్ కూడా పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్ హోదాలో పనిచేశాడని.. అనంతరం ఆర్మీ అధికారులకు కేటాయించిన కోటా ద్వారా సివిల్ సర్వీసెస్ లో చేరాడని చెబుతున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. పాకిస్థాన్ కు వచ్చిన రోజే ఈ వివాహం జరిగిందని చెబుతున్నారు. దీంతో.. ఈ రెండు కార్యక్రమాల మధ్యా ఏమైన సంబంధం ఉందా అనే చర్చా జరిగింది. అయితే.. దీనిపై స్పందించిన పాకిస్థాన్ జర్నలిస్ట్ జాహిద్... పాక్ పర్యటనలో ఉన్న యూఏఈ అధ్యక్షుడు మునీర్ కుమార్తె వివాహానికి హాజరు కాలేదని చెబుతున్నారు!
ఈ వివాహానికి సుమారు 400 మంది వరకూ అతిథులు హాజరైనట్లు ఆయనే పేర్కొన్నారు. ఇక, మునీర్ కు నలుగురు కుమార్తెలు కాగా.. తాజాగా వివాహం చేసుకున్న మహనూర్ మూడో కుమార్తె.