బిగ్ మూవ్... చైనాపై భారత్ 'ఉక్కు' పంచ్!

అవును... చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-12-31 09:30 GMT

ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌ కు స్వదేశంలో సరికొత్త సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా పక్కదేశం చైనా నుంచి తక్కువ ధరలకే ఉక్కు వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చౌక దిగుమతులు, నాసిరకం ఉత్పత్తుల వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

అవును... చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతి అయ్యే ఎంపిక చేసిన కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తులపై 12 శాతం టారిఫ్‌ లు విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టారిఫ్ ల అమలు స్వల్ప తేడాలతో మూడేళ్ల పాటు అమలులో ఉండనుంది. ఇది నూతన సంవత్సరం వేళ చైనాకు భారత్ నుంచి బిగ్ షాక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులపై తొలి సంవత్సరంలో ఈ సుంకం 12 శాతంగా ఉండనుండగా.. రెండో ఏడాదికి అది 11.5 శాతానికి తగ్గగా.. మూడో ఏడాదిలో 11 శాతానికి తగ్గి ఉండనుంది. ప్రధానంగా చైనా నుంచి తక్కువ ధరలకే ఉక్కు వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ఫలితంగా... దేశీయ ఉక్కు తయారీదారులపై ఈ ప్రభావం పడుతుందని.. ఈ నేపథ్యంలోనే ఈ సుంకాల నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో... చైనాతో పాటు నేపాల్, వియత్నాం దేశాలకు ఈ సుంకాలు వర్తించనున్నాయని అంటున్నారు. స్టెయిన్‌ లెస్‌ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది.

ఈ సందర్భంగా స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్)... ఇటీవల స్టీల్ దిగుమతులు గణనీయంగా పెరిగిపోవడంతో, దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపింది. ఈ క్రమంలోనే మూడేళ్లపాటు సుంకాల విధింపునకు సిఫార్సు చేసిందని అంటున్నారు. దాని ప్రకారమే తాజాగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా... ఈ ఏడాది ఏప్రిల్‌ లో భారత ప్రభుత్వం విదేశీ దేశాల నుండి వచ్చే అన్ని దిగుమతులపై 200 రోజుల పాటు 12 శాతం తాత్కాలిక సుంకాన్ని విధించింన సంగతి తెలిసిందే. ఇది నవంబర్ 2025లో ముగిసింది.

Tags:    

Similar News