ఎంపీ - ఎమ్మెల్యే లకి వ్యాక్సిన్ ఇద్దామ‌న్న ఆ రాష్ట్ర సీఎం..వద్దన్న మోడీ

Update: 2021-01-13 07:36 GMT
ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీనితో కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న భయం తొలగించడానికి దేశాధినేతలే మొదటగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. క‌రోనా భ‌యంతోనూ, అటు వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌నే భ‌యంతోనూ ప్ర‌జ‌లు న‌లిగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో దేశాధినేత‌లు తాము వ్యాక్సిన్ వేయించుకుంటూ, ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం  
పెరుగుతుంది అని అన్నారు. ఇక మనదేశంలో ఉన్న పరిస్థితిలో పెద్ద తేడా ఉంది. కొన్నేళ్ల కింద‌ట వ‌ర‌కూ పోలియో డ్రాప్స్ ప్ర‌భుత్వం ఉచితంగా వేస్తుంద‌న్నా కూడా.. కొంత‌మంది పిల్ల‌ల‌కు వాటిని వేయించే వారు కాదు.

పోలియో డ్రాప్స్ స్కూళ్ల‌లో వేస్తే అటువైపు పిల్ల‌ల‌ను తీసుకెళ్లే వారు కాదు,  ఇక ఆరోగ్య శాఖ సిబ్బంది ప‌ల్లెల‌కు పోలియో డ్రాప్స్ వేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు కూడా పిల్ల‌ల‌ను దాచేసే అమాయ‌క‌త్వం, మూర్ఖ‌త్వం ఉండిన దేశం మ‌న‌ది.  ఈ త‌ర్వాత పోలియో డ్రాప్స్ గురించి ప్ర‌భుత్వం ద‌శాబ్దాల పాటు విప‌రీత ప్ర‌చారం చేయాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కూ ఇప్పుడు ఇండియా పోలియో ఫ్రీ అయ్యింది. చ‌దువుకున్న వాళ్లు, ప్రొఫెస‌ర్లు, మేధావులు కూడా మాస్ వ్యాక్సినేష‌న్ వ‌ద్దంటున్నారు. అది క‌రోనా క‌న్నా పెద్ద స‌మ‌స్య అవుతుంద‌ని కూడా వారు తేల్చి చెబుతున్నారు.

ఇలాంటి నేప‌థ్యంలో వ్యాక్సిన్ గురించి ప్ర‌ధాని మోడీతో ముఖ్య‌మంత్రుల స‌మావేశం సంద‌ర్భంగా పాండిచ్చేరి సీఎం నారాయ‌ణ‌స్వామి. దేశంలో ముందుగా ఎంపీల‌కూ, ఎమ్మెల్యేల‌కూ క‌రోనా వ్యాక్సిన్ ను త‌ప్ప‌నిస‌రిగా వేయించాల‌ని, అప్పుడు ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ పై భ‌రోసా క‌లుగుతుంద‌ని ఆ సీఎం మోడీతో స‌మావేశంలో వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది. రాజ‌కీయ నేత‌లు వేయించుకుంటే ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్ పై ధీమా పెరుగుతుంద‌నేది క‌చ్చితంగా వాస్త‌వ‌మే. అయితే మోడీ మాత్రం ఈ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. అలాంటి డిమాండ్లు వ‌ద్ద‌ని కూడా మోడీ అన్నార‌ట‌. ఈ విష‌యంలో ప్ర‌ధాని వాద‌న ఏమిటంటే.. అలా చేస్తే ప్ర‌భుత్వం లా మేక‌ర్ల మీదే శ్ర‌ద్ధ వ‌హించిన‌ట్టుగా అవుతుంద‌ని, త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఫీల‌వుతార‌ని.. మోడీ అన్నార‌ట‌.
Tags:    

Similar News