బాలీవుడ్ మూవీని చూసి హడలెత్తిపోతున్న చైనా!
అంతే కాకుండా తమ దేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు భారత్ వాస్తవాలను వక్రీకరించి అంతర్జాతయ సమాజాన్ని తప్పుదోవ పట్టించిందంటూ బూటకపు వ్యాఖ్యలు చేసింది.;
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నటిస్తూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మూవీ 'బాటిల్ ఆఫ్ గల్వాన్'. 'జంజీర్' ఫేమ్ అపూర్వలాఖియా దర్శకుడు. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను సల్మాన్‌ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా టీమ్ విడుదల చేసింది. బీహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌కు సారధ్యం వహించిన కల్నల్ బి. సంతోష్‌బాబు చైనా ఆర్మీకి వ్యతిరేకంగా చేసిన వీరోచిత పోరాటం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.
టీజర్‌కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో చైనా అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' తన అక్కసు వెళ్లగక్కింది. చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారని గగ్గోలు పెట్టింది. అంతే కాకుండా ఈ సినిమాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ సినిమా జాతీయవాద మెలో డ్రామా అని ఆరోపించింది. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలకు భారత బలగాలే కారణమంటూ తమ దేశాన్ని సమర్దించుకునే ప్రయత్నం చేసింది. భారత బలగాలు తమ భూభాగంలోకి చొరబడి చైనా సైనికులపై దాడిచేశారంటూ అసత్యాలు వల్లవేసింది.
అంతే కాకుండా తమ దేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు భారత్ వాస్తవాలను వక్రీకరించి అంతర్జాతయ సమాజాన్ని తప్పుదోవ పట్టించిందంటూ బూటకపు వ్యాఖ్యలు చేసింది. చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనే మా సైన్యం ధృఢ సంకల్పాన్ని ఈ చిత్రం కదిలించలేదు' అంటూ చైనా సైనిక నిపుణులు సాంగ్ జాంగ్‌పింగ్ వ్యాఖ్యలను ఈ కథనంలో గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. దీనిపై చైనాకు భారత్ గట్టి కైంటర్ ఇచ్చింది. భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, తమ భావాలను కథలరూపంలో వ్యక్తపరచడం కూడా ఇందులో భాగమే అంటూ చైనా మీడియాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
'బాటిల్ ఆఫ్ గల్వాన్' విషయంలో ఎవరికైనా సందేహాలు గానీ, ఆందోళన గానీ ఉంటే స్పష్టత కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించొచ్చు. ఈ సినిమా విషయంలో ప్రభుత్వం జోక్యం ఏమీలేదు' అంటూ ఘాటుగా స్పందించింది. ఐదేళ్ల క్రితం 2020 జూన్‌లో భారత్- చైనా సరిహద్దుల్లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకరమైన ఘర్ణణలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత జవాన్లపై చైనా మెరుపు దాడికి దిగడంతో మన దళాలు ప్రతిదాడి చేశాయి.
ఈ వీరోచిత పోరాటంలో తెలంగాణకు చెందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనా వైపు కూడా భారీ స్థాయిలో ప్రాణ నష్టం ఉన్నప్పటికీ ఆ లెక్కలని చైనా దాచిపెట్టింది. ఈ పోరాటంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 1200 వందల మంది పాల్గొన్నారని, వారితో అత్యంత తక్కువ మంది సోల్జర్‌లతో కలిసి సంతోష్‌బాబు వీరోచిత పోరాటం చేసి చైనాని మట్టికరిపించాడట. అదే సంఘటన స్ఫూర్తితో సల్మాన్ ఇప్పుడు 'బాటిల్ ఆఫ్ గల్వాన్'ని నిర్మిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌తో సంచలనాలకు తెరలేపిన ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 17న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.