ఇరాన్ యుద్ధం పొడిగిస్తే అమెరికా ఖేల్ ఖతమేనా?

ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లు.. బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకునే విషయంలో ఈ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.;

Update: 2026-03-04 15:21 GMT

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ మరణించడంతో ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని అమెరికా భావించింది. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఇరాన్ మరింత దూకుడుగా ప్రతిస్పందిస్తోంది. దాడులను తగ్గించకుండా మరింత తీవ్రతరం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలను కొనసాగిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం నాలుగు వారాల్లో ముగుస్తుందని ప్రకటించినప్పటికీ తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అంత సులభంగా ముగిసేలా కనిపించడం లేదు. యుద్ధం మరింత కాలం సాగితే అమెరికా ఆయుధ నిల్వలపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై దాడులు ఇదే తీవ్రతతో కొనసాగితే అమెరికా వద్ద ఉన్న కొన్ని కీలక క్షిపణి వ్యవస్థల నిల్వలు గణనీయంగా తగ్గిపోవచ్చని పెంటగాన్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తోమహక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అలాగే శత్రు క్షిపణులను గాల్లోనే అడ్డుకునే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణులు వంటి అధునాతన ఆయుధాల వినియోగం యుద్ధంలో విస్తృతంగా జరుగుతోంది. ఈ దాడులు మరో పది రోజులు ఇదే స్థాయిలో కొనసాగితే అమెరికా వద్ద ఉన్న ఈ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లు.. బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకునే విషయంలో ఈ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, నౌకాదళ రక్షణ వ్యవస్థలు కూడా భారీగా వినియోగంలో ఉన్నాయని పెంటగాన్ పేర్కొంది. దీంతో ఈ ఆయుధాల నిల్వలను తిరిగి పునరుద్ధరించేందుకు భారీ వ్యయం అవసరం అవుతుందని అమెరికా రక్షణ శాఖ ట్రంప్ ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశాన్ని ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికాతో ఎలాంటి చర్చలకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక యుద్ధానికి ఇరాన్ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ కూడా అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. అణు చర్చలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దాడులు ప్రారంభించడం విశ్వాసఘాతుక చర్య అని ఆయన ఆరోపించారు. అణు చర్చలను వ్యాపార లావాదేవీల మాదిరిగా మార్చారని ట్రంప్‌పై మండిపడ్డారు.

ఇక అమెరికా మాత్రం తాము ఆయుధాల కొరతలో లేమని చెబుతోంది. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో స్పందిస్తూ అమెరికా వద్ద లెక్కలేనన్ని ఆధునిక ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే యుద్ధాన్ని మరో ఐదు వారాలు గానీ, అంతకంటే ఎక్కువ కాలం గానీ కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆయన అన్నారు. అంతేకాదు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కూడా అమెరికా ఆయుధ నిల్వలు ఉంచినట్లు వెల్లడించారు.

అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా అమెరికాకు భారీ భారం పడే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, మిస్సైళ్లతో ‘కాస్ట్ వార్’ వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News