అమెరికాలో ట్రక్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్
అమెరికాలో స్థిరపడి ట్రక్ డ్రైవింగ్ ను వృత్తిగా మార్చుకున్న వేలాది మంది ప్రవాసులకు ముఖ్యంగా భారతీయులకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీపి కబురును అందించింది.;
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అయ్యాక అక్కడ విదేశీయులను వేటాడుతున్నారు.. వెంటాడుతున్నారు. ఎలాగోలా ఆ దేశం నుంచి పంపించేందుకు కఠినమైన వలస చట్టాలను రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో హైవేల పై రోడ్డు ప్రమాదాలు పెరగడం.. అందులో విదేశీ డ్రైవర్ల పాత్ర ఎక్కువగా ఉండటంతో అక్కడ ట్రక్ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ లపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో ఈ వృత్తిపై ఆధారపడి పొట్ట పోసుకుంటున్న చాలా దేశాల డ్రైవర్లకు కాలిఫోర్నియా సహా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అమెరికాలో స్థిరపడి ట్రక్ డ్రైవింగ్ ను వృత్తిగా మార్చుకున్న వేలాది మంది ప్రవాసులకు ముఖ్యంగా భారతీయులకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీపి కబురును అందించింది. వివాదాస్పదంగా మారిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ లో రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగింది?
కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (డిఎంవి) ఇటీవల జారీ చేసిన లైసెన్సులలో డాక్యుమెంటేషన్ లోపాలు.. గడువు తేదీల్లో విద్యాసాలు ఉన్నాయని గుర్తించింది. ఈ సాంకేతిక కారణాలను చూపుతూ సుమారు 17వేల మందికి పైగా ప్రభాస డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేస్తున్నట్టు నోటీసులు జారీ చేసింది. ఇది వలస డ్రైవర్ల జీవనోపాధిని ఒక్కసారిగా ప్రశ్నార్థకం చేసింది.
పోరాట ఫలితం.. కోర్టు జోక్యంతో విముక్తి
ప్రభుత్వ నిర్ణయాన్ని వలసదారుల సంఘాలు పౌరహక్కుల సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డిఎంవి చేసిన తప్పులకు డ్రైవర్లను బలి చేయడం అన్యాయం అని వాదించాయి. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం ఉన్న లైసెన్స్ లో రద్దు ప్రక్రియను మార్చి నెల వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు వల్ల సుమారు 17వేల మందికి పైగా డ్రైవర్లు ప్రభావితమయ్యారు. లైసెన్సుల రద్దు పై మార్చి వరకు స్టే విధించడంతో ఇప్పుడు డాక్యుమెంటేషన్ గడువు తేదీలలో లోపాలను సవరించనున్నారు. డ్రైవర్లు తమ విధులను యధావిధిగా కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఈ తాత్కాలిక ఉపశమనం డ్రైవర్లకు పెద్ద ఊరటగా నిలిచినప్పటికీ సమస్య పూర్తిగా సమసి పోలేదు. మార్చి లోపు డ్రైవర్లు తమ డాక్యుమెంట్లను సరిచూసుకోవాలని.. లోపాలను సవరించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చట్టబద్ధంగా లైసెన్స్ కలిగి ఉన్నవారు ఈ గడువులోగా తమ పేపర్ వర్క్ ను క్లియర్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది వలస డ్రైవర్ల ఐక్యతకు దక్కిన తాత్కాలిక విజయంగా చెప్పవచ్చు.. కానీ వేలాది కుటుంబాల జీవనోపాధిని కాపాడిన ఈ నిర్ణయం పై ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.