న్యూ ఇయర్ వేళ న్యూ కరెన్సీ.. మిలమిల మెరిసిపోతున్న కొత్త నోట్లు!

అయితే తాజాగా నూతన సంవత్సరం వేళ ఓ దేశం మాత్రం కొత్త కరెన్సీని విడుదల చేసింది.. సరిగ్గా 2026 - జనవరి 1 నుంచి ఆ కరెన్సీ అమల్లోకి వస్తుందని ప్రకటించింది.;

Update: 2025-12-31 12:30 GMT

సాధారణంగా నూతన సంవత్సరం వేడుకల వేళ కొన్ని ప్రభుత్వాలు పిండి వంటల పదార్థాలు పంచిపెడితే... మరికొన్ని ప్రభుత్వాలు కొత్త పథకాలను ప్రకటిస్తాయి.. ఇంకొన్ని ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గించే విషయాలను వెల్లడిస్తుంటాయి.. చాలా ప్రభుత్వాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మాత్రం చెబుతాయి. అయితే తాజాగా నూతన సంవత్సరం వేళ ఓ దేశం మాత్రం కొత్త కరెన్సీని విడుదల చేసింది.. సరిగ్గా 2026 - జనవరి 1 నుంచి ఆ కరెన్సీ అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

అవును... డమాస్కస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా కొత్త కరెన్సీ నోట్లను ఆవిష్కరించారు. అందులో ప్రధానంగా... నిరంకుశత్వ పాలనకు ప్రతీకగా నిలిచి, గత ఏడాది దేశం విడిచి పారిపోయిన, పదవీచ్యుతుడైన నాయకుడు బషర్ అల్-అసద్, అతని తండ్రి హఫీజ్ అల్-అసద్ ల ఫోటోలను కరెన్సీపై కనిపించకుండా తొలగించారు. జనవరి 1 నుంచి ఈ కొత్త కరెన్సీ చలామణిలోకి రానుందని వెల్లడించారు.

తాజాగా విడుదలైన కొత్త కరెన్సీలో 10, 25, 50, 100, 200, 500 సిరియన్ పౌండ్ల విలువల నోట్లు ఉన్నాయి. వీటిపై గతంలో ఉన్న రాజకీయ చిత్రాల స్థానంలో సిరియా ప్రసిద్ధి చెందిన గులాబీలు, గోధుమలు, నారిమజ్లు, ఆలివ్ లు, మల్బరీలతో సహా పలు వ్యవసాయ చిత్రాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా స్పందించిన అల్-షరా.. ఈ కొత్త కరెన్సీ నోట్లు "మునుపటి విచారణ దశ ముగింపు, సిరియన్లు కోరుకునే కొత్త దశ ప్రారంభం" అని అన్నారు.

ఇదే సమయంలో.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అనేది కేవలం నోట్లను మార్చడంతోనే సాధ్యం కాదని.. ఉత్పత్తి రేట్లను పెంచాలని.. నిరుద్యోగ రేటును తగ్గించాలని.. వీటిపైనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం ఆధారపడి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా... ఆర్థిక వృద్ధిని సాధించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలలో ఒకటి.. బ్యాంకింగ్ పరిస్థితిని మెరుగుపరచడం అని, బ్యాంకులు ఆర్థిక వ్యవస్థ అనే గుండెకు రక్తం ప్రసరింపచేసే ధమనుల వంటివని అన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన సిరియా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ ఖాదర్ హోస్రియా మాట్లాడుతూ... కరెన్సీ మార్పిడి ప్రక్రియ 90 రోజుల్లోగా పూర్తవుతుందని.. అవసరం అనుకుంటే మరికొంత కాలం పొడిగించబడుతుందని.. ఈ విషయంల్లో అంతా తొందర పడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు.

కాగా.. గతంలో సిరియాలోని 2,000 పౌండ్ల నోట్లపై సుమారు 25 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని పాలించిన నియంత బషర్ అల్-అసద్ ఫోటో.. 1,000 పౌండ్ల నోట్లపై అతని తండ్రి హఫీజ్ అల్-అసద్ ఫోటోలు ఉండేవి! అయితే... బషర్ అల్-అసద్ 2024లో రష్యాకు పారిపోగా... 1971 నుంచి ఆ దేశాన్ని పాలించిన అతని తండ్రి 2000 మరణించాడు. వీరి హయాంలోనే సిరియా పూర్తిగా పతనం అంచుకు చేరుకుంది!

సిరియా కరెన్సీ పతనం ఇలా జరిగింది!:

వాస్తవానికి సిరియాన్ పౌండ్ పతనం 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ మొదలైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో... తొలుత 2011 మార్చిలో 1 యూఎస్ డాలర్ కు సుమారు 47 సిరియన్ పౌండ్లుగా ట్రేడవ్వగా.. జూలై 2017 నాటికి అనూహ్యంగా 1 డాలర్ కు సుమారు 515 సిరియన్ పౌండ్లకు పడిపోయింది. ఇక లెబనాన్ ద్రవ్య సంక్షోభం అనంతరం 2023 ఏప్రిల్ లో 1 డాలర్ కు 7,500 సిరియన్ పౌండ్లకు చెరుకోగా... 2024లో అల్-అసద్ పాలన కూల్చివేసే నాటికి ఒక డాలర్ కు 25,000 పౌండ్లకు పరిస్థితి దిగజారిపోయింది. అయితే.. ప్రస్తుతం ఈ కరెన్సీ డాలర్ కు సుమారు 11,000 సిరియన్ పౌండ్ల వద్ద ట్రేడవుతూ.. ఉన్నంతలో కాస్త మెరుగుపడుతూ ఉంది!



Tags:    

Similar News