రాజభవనం టు జైలు... ఊసలు లెక్కపెడుతున్న దేశాధినేతలు వీరే!

అవును... ఒకప్పుడు వారు దేశాన్ని పాలించినవాళ్లు.. ఒకప్పుడు వారు చెప్పిందే శాసనం, వారి పలికిందే నిర్ణయం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి.;

Update: 2025-12-31 14:10 GMT

ఒకప్పుడు వాళ్లంతా దేశాధినేతలు.. ఏళ్లపాటు దేశ రాజకీయాలను శాసించినవారు.. మరికొంతమంది నియంతలుగా పరిపాలించి, అవినీతి కార్యకలాపాల్లో ఆరితేరిన వాళ్లు కాగా.. మరికొంతమంది రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కటకటాలపాలైనట్లు చెబుతుంటారు. ఏది ఏమైనా... ఒకప్పుడు రాజభవనాల్లో ధర్జాగా బ్రతికిన వాళ్లు తొమ్మిది నుంచి పదడుగుల జైలు గదుల్లో బ్రతుకీడుస్తున్నారు!

అవును... ఒకప్పుడు వారు దేశాన్ని పాలించినవాళ్లు.. ఒకప్పుడు వారు చెప్పిందే శాసనం, వారి పలికిందే నిర్ణయం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. కట్ చేస్తే... పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇందులో వారి స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉండగా.. మరికొన్ని కాలం కాటు వేసిన పరిస్థితులు అని అంటారు! కారణం ఏదైనా, పరిస్థితి మరేదైనా.. ప్రస్తుతం వారి పరిస్థితి మాత్రం ఏడు ఊసల లెక్కలే!

పాకిస్థాన్ - ఇమ్రాన్ ఖాన్ (వయస్సు 71)!:

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.. మరో 17 ఏళ్లు జైల్లో ఉండేలా ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రధానమంత్రి హోదాలో విదేశీ పర్యటనలు చేసిన సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలతో పాటు ఆయనపై పలు అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు కేసుల్లో దోషిగా తేలి జైల్లో ఉన్నారు. అయితే.. ఇందులో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పెట్టిన తప్పుడు కేసులూ ఉన్నాయని అంటారు!

మలేషియా - నజీబ్ రజాక్ (వయస్సు 72)!:

మలేషియా మాజీ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ కు డిసెంబర్ 26 - 2025న 15 ఏళ్ల జైలు శిక్ష, 13.5 బిలియన్ రింగిట్ (దాదాపు 3.3 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది కౌలాలంపూర్ హైకోర్టు! దీనికి కారణం... ఆ దేశ అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్‌ బెహ్రాత్‌ (1 ఎండీబీ) నిధి నుంచి భారీ మొత్తాన్ని తన వ్యక్తిగత ఖాతాలోకి తరలించినట్లు తేలడమే!

పెరూ - మార్టిన్ విజ్కారా (వయస్సు 63)!:

నవంబర్ 2018లో అధ్యక్షుడైన సమయంలో... ఎట్ ఎనీ కాస్ట్ అవినీతిపై పోరాటం విషయంలో తగ్గేదేలేదు అని ప్రతిజ్ఞ చేశాడు మార్టిన్ విజ్కార్రా. కట్ చేస్తే... నవంబర్ 2025లో అధ్యక్ష పదవికి ముందు గవర్నర్‌ గా ఉన్న సమయంలో లంచాలు తీసుకున్నందుకు అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఇదే సమయంలో... తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వ కార్యాలయాల నుండి నిషేధం కూడా విధించబడింది. ప్రస్తుతం లిమాలోని బార్బాడిల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

పెరూ – పెడ్రో కాస్టిల్లో (వయస్సు 56)!:

2022లో కాంగ్రెస్‌ ను రద్దు చేయడానికి ప్రయత్నించిన తర్వాత పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో.. తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు 2025 చివరిలో పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అతను ప్రస్తుతం లిమాలో నిర్బంధంలో ఉన్నాడు.. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలపై నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు.

ఫిలిప్పీన్స్ – రోడ్రిగో డ్యూటెర్టే (వయస్సు 80)!:

ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు.. 2025 మార్చిలో ఆ దేశంలోని మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వేల మంది మరణించారన్న ఆరోపణలుపై విచారణ జరిపిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం వారెంట్‌ మేరకు రోడ్రిగో డ్యూటెర్టె ఇటీవల అరెస్టయ్యారు. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం అతను 2026 అంతటా కస్టడీలో ఉంటాడని భావిస్తున్నారు.

ఫ్రాన్స్ – నికోలస్ సర్కోజీ (వయస్సు 70)!:

2007లో లిబియా నుండి అక్రమ ప్రచార నిధుల సేకరణకు సంబంధించిన నేరపూరిత కుట్రకు సంబంధించి ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ అక్టోబర్ 2025లో ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించడం ప్రారంభించారు. అయితే... నవంబర్ 10, 2025న అతని విడుదల కోసం చేసిన అభ్యర్థనను అప్పీల్ కోర్టు ఆమోదించింది. దీనితో అతని మూడు వారాల్లోనే జైలు శిక్ష ముగిసింది. ప్రస్తుతం అతను ఫ్రాన్స్ వదిలి వెళ్లకుండా నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు!

దక్షిణ కొరియా - యూన్ సుక్ యోల్ (వయసు 65)!:

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ ను మార్షల్ లా ప్రయత్నం విఫలమైనందుకు జనవరి 15, 2025న అరెస్టు చేశారు. డిసెంబర్ 2024లో మార్షల్ లా విధించడానికి ఆయన చేసిన క్లుప్త ప్రయత్నం, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంబంధిత ప్రవర్తనకు సంబంధించిన బహుళ క్రిమినల్ కేసులకు ఆయన కేంద్ర బిందువుగా ఉన్నారు. ఈ కేసు తుది తీర్పు 2026 జనవరిలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు!

Tags:    

Similar News