పోలీసుల అదుపులో భార్గవ్ రామ్.. నిజమెంత?

Update: 2021-01-13 05:57 GMT
సంచలనంగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా భావిస్తున్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఎక్కడ? అన్నది ప్రశ్నగా మారింది. నేరం జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుల్ని గుర్తించే సత్తా ఉన్న హైదరాబాద్ పోలీసులు.. కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ ను గుర్తించకుండా ఉంటారా? అన్నది ప్రశ్న. నేరం జరిగి వారంపైనే దాటిపోవటం.. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అఖిలప్రియను వెంటనే అరెస్టు చేసిన పోలీసులు.. ఆమెను విచారించారు.

ఈ సందర్భంగా వెల్లడైన సమాచారంతో పాటు.. తమ వద్ద ఉన్న ఆధారాలతో భార్గవ్ రామ్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు ధ్రువీకరించటం లేదు. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం భార్గవ్ రామ్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను ఆచూకీ ఇంకా లభించకపోవటం.. మరికొందరు ముఖ్యుల వివరాలు తేలని నేపథ్యంలో.. వారిని అదుపులోకి తీసుకునే వరకు భార్గవ్ రామ్ ను అదుపులోకి తీసుకున్న వివరాలు బయటపెట్టరన్న మాట వినిపిస్తోంది.

అయితే.. చిన్న కేసుల్లో ఇలాంటివి చేస్తారే కానీ.. హైప్రొఫైల్ కేసుల్లో ఇలాంటివి సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా భార్గవ్ రామ్ పోలీసుల అదుపులోనే ఉన్నారా? లేరా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా గోవా.. విజయవాడలో మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరికి కిడ్నాప్ వ్యవహారంలో సంబంధం ఉందన్న మాట వినిపిస్తోంది. 
Tags:    

Similar News