ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలు...ఇది పక్కా....?

Update: 2022-11-28 02:30 GMT
ఏపీలో ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరుగుతాయా. అంటే జగన్ వేస్తున్న అడుగులు ఆ వైపుగానే ఉన్నాయని అంటున్నారు. విపక్షాల వీక్ నెస్ ని పసిగట్టి వారు అలా ఉండగానే ముందస్తు ఎన్నికలతో విరుచుకుపడిపోవాలన్న్నదే జగన్ మార్క్ స్ట్రాటజీ అని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది  బడ్జెట్ సెషన్ పెట్టి బడ్జెట్ ఆమోదించిన తరువాత అసెంబ్లీ రద్దు చేస్తారని అంటున్నారు. అలా అన్నీ అనుకూలించే ఏప్రిల్ నెలలో ఎన్నికలకు తెరలేపాలని జగన్ చూస్తున్నారుట.

ఏప్రిల్ లో  ఏపీ ఎన్నికలు అని ఇపుడు ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. నిజానికి చూస్తే 2019లో ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరిగాయి. అందువల్ల ఏప్రిల్ అయితే సెంటిమెంట్ పరంగా కలసివస్తుందని భావిస్తున్నారు. ఎండలు కూడా అప్పటికి బాగా ముదరవు కాబట్టి పోలింగ్ కూడా బాగా సాగుతుంది అని అంచనా కడుతున్నారు. జనాలలో  కూడా వ్యతిరేకత ఉండకపోవచ్చు అని లెక్కలేసుకుంటున్నారు.

ఇక కీలకమైన శాఖల్లో అధికారుల నియామకం కూడా ముందస్తు ఎన్నికల కోసమే అని అంటున్నారు. సొంత సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నారు అని ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా వారితో పని జరుగుతుంది, రేపటి ఎన్నికల్లో వారి ఉపయోగం ఉంది అనుకున్న మీదటనే నియామకాలు చేపడుతోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే రాజకీయంగా విపక్షాలు ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు. పొత్తుల విషయం కూడా ఏమీ తేలలేదు. జనసేన అటు బీజేపీతో ఉన్నట్లా లేక టీడీపీతో ఉన్నట్లా అన్నది చెప్పలేకపోతోంది. అయితే వైసీపీ మాత్రం కచ్చితంగా జనసేన టీడీపీతో జట్టు కడుతుంది అనే ఊహిస్తోంది. చివరి నిముషంలో పొత్తులకు ఈ రెండు పార్టీలు రెడీ అవుతాయని, వారి మధ్య లోపాయికారీ అవగాహన ఉందని ఊహిస్తోంది.

వారికి ఆ చాన్స్ ఇవ్వకూడదని, ఇచ్చినా కూడా అది ఫలించకుండా చేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమే మార్గం అని కూడా భావిస్తోందిట. ఇక డిసెంబర్ 8న బీసీల సదస్సు రాష్ట్ర స్థాయిలో  నిర్వహిస్తున్నారు. రాజకీయ రాజధానిగా పేరు పడిన విజయవాడలో ఈ సదస్సు జరుగుతోంది. అలాగే బీసీ మంత్రులతో మరో దఫా ఏపీలో బస్సు యాత్ర చేపడతారు అని అంటున్నారు. అలా జిల్లాల వారీగా బీసీ సదస్సులు నిర్వహించే ఆలోచనలు ఉన్నాయట.

మరో వైపు డిసెంబర్ మొదటి వారంలో ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహిస్తారని, అందులో టికెట్ దక్కని వారి వివరాలు చూచాయగా బయట పెట్టడం ద్వారా ఎన్నికలకు తెర తీస్తారని అంటున్నారు. ఆరు నూరు అయినా వచ్చే ఏడాది ఎన్నికలు ఏపీలో జరగడం ఖాయమనే అంటున్నారు. మరి అన్ని లెక్కలూ చూసుకుని సాహసించి జగన్ ఎన్నికలకు వెళ్తున్నారని, ఫలితాలు అనుకూలంగా ఉంటాయా అంటే దానికి జనాలే జవాబు చెప్పాల్సి ఉంటుంది.
'

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News