లాభాల ఆశ చూపి మహిళ వల.. కోట్లు పోగొట్టుకున్న బాధితులు విలవిల

Update: 2021-12-27 09:51 GMT
పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అవగాహనా కార్యక్రమం చేపట్టినా చాలామంది మోసాలకు గురవుతూనే ఉన్నారు. అధిక లాభాల పేరిట మోసపోవద్దని చెప్పినా... మాయమాటలు విని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తీరా చేతులు కాలాక.... అన్న చందంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే పెట్టుబడులు-అధిక లాభాల పేరుతో ఓ మహిళ ఏకంగా రూ.200 కోట్లను కొల్లగిట్టింది. బాధితులకు టోపీలు పెట్టి పత్తాలేకుండా పోయింది.

పార్ట్ టైం జాబ్ పేరిట లవ్ లైఫ్ పేరుతో రూ.200 కోట్లు కొల్లగొట్టింది అనసూయ అనే మహిళ. టెలిగ్రామ్ యాపులో గ్రూపులు క్రియేట్ చేసి... అత్యధిక లాభాల పేరిట వల వేసిందని బాధితులు తెలిపారు. ఒక్కో గ్రూపులో 250 మందిని చేర్చి... వివిధ చార్జీల పేరిట వసూలు చేసిందని చెప్పారు. పైగా పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించేదని పేర్కొన్నారు. ఈ విధంగా ఆమె చేతిలో చాలామంది మోసపోయారు.

మహిళ చేతిలో లక్షలు రూపాయలు పోగొట్టుకున్న బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏపీలోని విశాఖ, విజయవాడ, గుంటూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆ రాష్ట్రంలో మరికొంత మంది బాధితులు కూడా బయటకు వస్తున్నారని వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లోనూ చాలామంది ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మహిళ మాటలు నమ్మి ఏకంగా రూ.18లక్షలు ఇచ్చినట్లు ఓ బాధితుడు బెజవాడ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. మెడికల్ డివైజ్ రీఛార్జీల పేరిట పెట్టుబడులు పెడితే... దాదాపు పది రెట్ల లాభం వస్తుందని చెప్పిందని తెలిపారు. తనతోపాటు చాలామంది ఆమె చేతిలో మోసపోయారని పోలీసులకు వివరించారు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

మహిళ మోసాలపై స్పందించిన ఏపీ పోలీసులు... ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక లాభాలు, పెట్టుబడుల పేరుతో నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. ఆన్ లైన్ వేదికగా జరిగా లావాదేవీల పట్ల జాగ్రత్తగా వ్యవహించాలని అంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కేటుగాళ్లకు ధారపోయకుండా... ఆలోచించాలని సూచించారు.



Tags:    

Similar News