పది నెలల పిల్లాడు.. కరోనాను జయించేశాడు

Update: 2020-04-09 04:45 GMT
కంటికి కనిపించని కరోనాతో వేలాది మంది మరణించారు. రానున్న రోజుల్లో మరెంత మంది ప్రాణాలు కోల్పోతారో తెలీని పరిస్థితి. ఇలాంటివేళ.. పది నెలల పసిప్రాయంలో కరోనాకు గురైతే ఒక బుడతడు.. ఆ మహమ్మారితో ఫైటింగ్ చేసి ప్రాణాలు నిలుపుకోవటమే కాదు.. తాజాగా కరోనా నెగిటివ్ తేలటం అద్భుతంగా మారింది. కరోనా పెద్ద వయస్కుల వారికే తప్పించి.. చిన్నపిల్లల మీద పెద్దగా ప్రభావం చూపదన్న వాదన తొలుత వినిపించినా.. ఆ పిశాచి వైరస్ కు అలాంటివేమీ ఉండవన్న విషయం స్పష్టమైంది.

తనకు దగ్గరకు వచ్చిన ఎవరిలోనైనా వ్యాపిస్తానన్న విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో.. వారు వీరు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరు ప్రభావితమయ్యే దుస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడుకు చెందిన పది నెలల శిశువు కరోనా బారిన పడ్డాడు. దీంతో.. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. కోయింబత్తూరులో వెలుగు చూసిన ఈ ఉదంతంలో చిన్నారి తల్లితో పాటు.. నాయనమ్మ.. వారి పని మనిషి కూడా కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉంటే.. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం కరోనాను ఆ చిన్నారి జయించాడు.

ఇంతకీ ఆ బుజ్జాయికి కరోనా ఎలా సోకిందన్న విషయంలోకి వెళితే.. తల్లి వైద్యురాలు కావటం.. ఒక కరోనా పేషెంట్ కు వైద్యం చేసే క్రమంలో ఆ దుర్మార్గ వైరస్ ఆమెకు సోకింది. ఆమె ద్వారా బుజ్జాయికి.. అమ్మమ్మకు.. వారింట్లో పని మనిషికి సోకింది. అయితే.. సకాలంలో వైద్యసేవలు అందటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. పది నెలల చిరుప్రాయంలో కరోనాకు గురి కావటం ఆందోళన కలిగించినా.. దాని బారి నుంచి బయటపడటం మాత్రం ఇప్పుడు అద్భుతంగా మారింది.
Tags:    

Similar News