అమెరికా స్టోర్లలో భారతీయ మహిళల దొంగతనాలు..భారతీయుల పరువు పోతోంది

అమెరికాలో టార్గెట్ స్టోర్లలో భారతీయ మహిళలు షాపులిఫ్టింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.;

Update: 2025-09-08 08:18 GMT

అమెరికాలో టార్గెట్ స్టోర్లలో భారతీయ మహిళలు షాపులిఫ్టింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనల బాడీక్యామ్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనలు వ్యక్తిగత ప్రతిష్టను మాత్రమే కాకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజం మొత్తం ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జనవరిలో వాషింగ్టన్‌లో జరిగిన సంఘటన

గత జనవరి 15న వాషింగ్టన్‌లోని ఒక టార్గెట్ స్టోర్‌లో గుజరాతీ మాట్లాడే భారతీయ మహిళ షాపులిఫ్టింగ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన బాడీక్యామ్ వీడియోలో ఆమె గట్టిగా ఏడుస్తూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ కనిపించింది. పోలీసులు ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె బయటకు వెళ్లడానికి స్వేచ్ఛ లేదని స్పష్టం చేశారు. ఆమెకు అనువాదకుడి సహాయం కావాలా అని అడిగినా తిరస్కరించింది. స్టోర్ సిబ్బంది సీసీటీవీ వీడియో చూపించగా, ఆమె చెకౌట్ కౌంటర్ వద్ద బిల్లు చెల్లించకుండా కార్ట్ నిండా వస్తువులు తీసుకెళ్లినట్లు తేలింది. చివరికి ఆ మహిళ దొంగిలించిన వస్తువులను తిరిగి అమ్మాలన్న ఉద్దేశ్యంతోనే తీసుకెళ్లినట్లు అంగీకరించింది. పోలీసులు ఆమెను కోర్టులో హాజరు కావాలని సూచించారు.

జూలైలో ఇల్లినాయిస్‌లో మరో ఘటన

ఇదే తరహా మరో సంఘటన జూలైలో ఇల్లినాయిస్‌లో వెలుగుచూసింది. ఒక భారతీయ మహిళ సుమారు ₹1.1 లక్షల విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రికార్డుల ప్రకారం.. ఆ మహిళ ఏకంగా ఏడు గంటలకు పైగా ఆ స్టోర్‌లో గడిపినట్లు తెలిసింది. బాడీక్యామ్ వీడియోలో ఆమె కన్నీళ్లతో క్షమాపణలు చెబుతూ "నేను ఈ దేశానికి చెందినది కాదు" అని చెప్పింది. దీనికి ప్రతిగా ఒక అధికారి "భారతదేశంలో వస్తువులు దొంగిలించడానికి అనుమతిస్తారా? నాకు అలాగా అనిపించట్లేదు" అంటూ గట్టిగా స్పందించాడు. అనంతరం ఆమెను హ్యాండ్‌కఫ్స్ వేసి స్టేషన్‌కి తరలించారు.

* వివాదాస్పదంగా మారిన సంఘటనలు

ఈ రెండు ఘటనలు అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపులిఫ్టింగ్ లాంటి నేరాలు వ్యక్తిగత ప్రతిష్టను మాత్రమే కాకుండా మొత్తం కమ్యూనిటీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. భారతీయ సమాజంలో ఒకరు చేసే తప్పు వల్ల అందరూ తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ఇలాంటివి దేశం పేరుకు మచ్చ తెస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనలు భవిష్యత్తులో భారతీయ ప్రయాణికులకు, ఉద్యోగులకు వీసా లేదా ఇమ్మిగ్రేషన్ సమస్యలను సృష్టించవచ్చనే భయాందోళనలు కూడా నెలకొన్నాయి.

అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, ఇలాంటి చిన్న చిన్న నేరాలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలు భారతీయులు అమెరికాలో మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానిక చట్టాలను గౌరవించాలని గుర్తు చేస్తున్నాయి.

Tags:    

Similar News