విదేశాల్లో భారతీయుల బాట.. కలల వెంబడి కష్టాల వలయం
“ఓసారి అమెరికా చేరితే జీవితం సెట్ అయిపోతుంది”, “కెనడా వెళ్తే భవిష్యత్తు బంగారం లాంటిది”, “ఆస్ట్రేలియాలో చదివితే కరీర్ సురక్షితం” .. ఇలా చాలా మంది యువత మనసులో ఈ ఆలోచనలు గాఢంగా గూడు కట్టుకున్నాయి.;
“ఓసారి అమెరికా చేరితే జీవితం సెట్ అయిపోతుంది”, “కెనడా వెళ్తే భవిష్యత్తు బంగారం లాంటిది”, “ఆస్ట్రేలియాలో చదివితే కరీర్ సురక్షితం” .. ఇలా చాలా మంది యువత మనసులో ఈ ఆలోచనలు గాఢంగా గూడు కట్టుకున్నాయి. చదువుకోసం, ఉద్యోగం కోసం, వ్యాపార అవకాశాల కోసం వేల కిలోమీటర్ల దూరం వెళ్ళే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. కానీ ఆ కలల వెనక దాగి ఉన్న వాస్తవం అంత సులభం కాదు.
* అమెరికా.. వీసా కలలు, వీసా కష్టాలు
హైదరాబాద్ నుంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లిన అనిల్ కథ వింటే అర్థమవుతుంది. రెండు ఏళ్ళు కష్టపడి మాస్టర్స్ పూర్తి చేశాడు. కానీ వీసా పొడిగింపులో ఇబ్బందులు మొదలయ్యాయి. భారీ ఫీజులు, ఎప్పటికప్పుడు కొత్త నియమాలు, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి. “ఒకవైపు కల, మరోవైపు ఆందోళన” అనిల్ మాటల్లో అమెరికా జీవితం అదే.
* ఆస్ట్రేలియా.. కలల వెనక దాగిన భయం
మెల్‌బోర్న్‌లో చదువుతున్న రమ్య చెబుతుంది. “ఇక్కడ చదువుకోవడం గొప్ప అనుభవం, కానీ రోడ్ల మీద నడిచేటప్పుడు భయం వెంటాడుతుంది”. ఎందుకంటే జాత్యాహంకారం ఘటనలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. దేవాలయాలపై దాడులు, విద్యార్థులపై దాడులు… ఇవి కొంతమందిని వెనక్కి వెళ్లిపోవాలా? అన్న ఆలోచనలో పడేస్తున్నాయి.
* కెనడా – స్వర్గధామం నుంచి సవాళ్ల దారి
కొన్ని సంవత్సరాల క్రితం కెనడా అంటే ప్రతి విద్యార్థి కల. సులభమైన వీసాలు, చౌకైన విద్య, అంతర్జాతీయ ఒత్తిడి లేని జీవితం. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది. ఇళ్లు దొరకకపోవడం, అద్దెలు ఆకాశాన్నంటడం, ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. “కల నెరవేరింది కానీ ఊహించిన సుఖం రాలేదు” అని చెప్పే వారు పెరుగుతున్నారు.
* మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం
ఇది కేవలం వారి సమస్య కాదు. మన ప్రవర్తన, మన ఆచారాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇండియాలో సహజంగా అనిపించే కొన్ని విషయాలు రోడ్లపై గుంపులు కూర్చోవడం, పెద్దగా శబ్దం చేయడం, ర్యాలీలు నిర్వహించడం విదేశాల్లో స్థానికులకు అసహనంగా అనిపిస్తాయి. వారి సంస్కృతిని గౌరవించడం, వారి చట్టాలను కచ్చితంగా పాటించడం తప్పనిసరి.
* రెండు వైపుల వాస్తవం
ఒకవైపు మనవాళ్లు కష్టపడి పనిచేస్తే, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం అవుతున్నారు. ఐటీ నుంచి మెడికల్ వరకు ప్రతి రంగంలోనూ భారతీయుల కృషి అమూల్యం. మరోవైపు, అక్కడి స్థానికులు “మన ఉద్యోగాలు పోతున్నాయి, అవకాశాలు తగ్గుతున్నాయి” అనే ఆందోళనతో వ్యతిరేకత పెంచుతున్నారు. ఈ రెండింటి మధ్యలో మనవాళ్లు బతుకుతున్నారు.
ప్రవాస భారతీయులు సంపాదించే ప్రతి రూపాయి వెనక ఇక్కడి కుటుంబం, ఇక్కడి గ్రామం, ఇక్కడి దేశం ఉంది. అందుకే వారి ప్రవర్తనపై, వారి ఇమేజ్‌పై ఎక్కువ బాధ్యత ఉంటుంది. “రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలి” అనే మాట మనసులో దించుకుంటేనే, “విదేశాల్లో భారతీయుల రోజులు బాగోలేవు” అనే మాటను ప్రస్తుతం అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.