అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్
అమెరికాలో ఉండే భారతీయులకు ఇదో డేంజర్ బెల్. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లిన భారతీయ సంతతి మహిళను అరెస్ట్ చేసి దారుణంగా ట్రీట్ చేశారు అక్కడ పోలీసులు;
అమెరికాలో ఉండే భారతీయులకు ఇదో డేంజర్ బెల్. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లిన భారతీయ సంతతి మహిళను అరెస్ట్ చేసి దారుణంగా ట్రీట్ చేశారు అక్కడ పోలీసులు. దీంతో ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అమెరికాలో ఉంటున్న భారత సంతతి మహిళ బబ్లెజిత్ కౌర్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. తమ పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన ఇంటర్వ్యూ/ బయోమెట్రిక్ కోసం వెళ్లిన ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
బబ్లెజిత్ కౌర్ 1994 నుంచి అమెరికాలో చట్టబద్దమైన హోదాలో నివసిస్తున్నారు. ఆమె ముగ్గురు పిల్లల్లో ఇద్దరికీ అమెరికా పౌరసత్వం ఉంది. మరో కుమార్తె జోతికి యూఎస్ లో నివసించేందుకు లీగల్ స్టేటస్ ఉంది. డిసెంబర్ 1న తమ తల్లి పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి బయోమెట్రిక్ స్కాన్ కోసం ఫెడరల్ ఏజెంట్ ఆఫీసుకు వెళ్లినట్లు కౌర్ కుమార్తె జోతి తెలిపారు. ఆ సమయంలోనే అధకారులు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్ట్ జరుగుతున్నప్పుడే కౌర్ తమ న్యాయవాది తో మాట్లాడినా.. అధికారులు నిర్బంధించారని కుటుంబ సభ్యులు వాపోయారు. తొలుత చాలా గంటల వరకూ ఆమెను ఎక్కడికి తీసుకెల్లారనే సమాచారం కూడా కుటుంబానికి తెలియలేదు. ఆ తర్వాత పెద్ద గదిలో ఇతర ఖైదీలతో పాటు ఆమెను ఉంచినట్లు తెలిసింది.
కుటుంబ సభ్యుల ఆవేదన
బబ్లెజిత్ కౌర్ ను చూసేందుకు అధికారులు ఆమె కుటుంబ సభ్యులను అనుమతించారు. ఈ సందర్భంగా కుమార్తె జోతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇది ఒక పీడకలలా ఉంది. ఆమెను బయటకు తీసుకురావడానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా అమానుషం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విడుదల కోసం ప్రయత్నాలు..
ప్రస్తుతం కౌర్ ను పూచీకత్తుపై బెయిల్ పై విడుదల చేయించేందుకు కుటుంబం యత్నిస్తోంది. లాంగ్ బీచ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కౌర్ కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని.. ఆమె విడుదలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఆయన కార్యాలయం పేర్కొంది.
ఈ అరెస్ట్ అమెరికాలో చట్టబద్దంగా నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీలో ఆందోళన కలిగించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బబ్లెజిత్ కౌర్ విడుదల కోసం కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం. విడుదల చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.