అమెరికాలో ఎన్నారైల ఆధ్యాత్మిక యాత్ర.. విషాదయాత్రైంది..

ఆధ్యాత్మిక ప్రయాణంలో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయ అమెరికన్లు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.;

Update: 2025-08-04 05:39 GMT

అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయ అమెరికన్లు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన భారతీయ సమాజాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. మృతులను కిషోర్ దివాన్ (89), ఆషా దివాన్ (85), షైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)గా అధికారులు గుర్తించారు. న్యూయార్క్‌లో నివసించే ఈ నలుగురు జూలై 29న పశ్చిమ వర్జీనియాలోని ఆధ్యాత్మిక కేంద్రం "ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్" ను సందర్శించేందుకు 2009 మోడల్ టయోటా క్యామ్రీ కారులో ప్రయాణం ప్రారంభించారు. అయితే మార్షల్ కౌంటీలోని బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్ వద్ద రాత్రి సుమారు 9:30 గంటలకు వారి కారు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రత కారణంగా ఘటనాస్థలంలోనే వారు మరణించినట్లు మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డొహెర్టీ ధ్రువీకరించారు.

ఎలా జరిగిందంటే..

ఈ నలుగురు ప్రయాణంలో చివరిసారిగా పెన్సిల్వేనియాలోని ఓ బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో కనిపించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు కుటుంబ సభ్యులు రెస్టారెంట్‌లోకి వెళ్లినట్లు నమోదైంది. వారి చివరి క్రెడిట్ కార్డ్ లావాదేవీ కూడా అక్కడే జరగడంతో అది చివరి ఆధారంగా మారింది. తర్వాత స్టేట్ పోలీస్ కెమెరా వారి వాహనం ఇంటర్‌స్టేట్ 79 పై పిట్స్‌బర్గ్ వైపు వెళ్తున్నట్లు గుర్తించింది.

వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్షల్ కౌంటీ, ఓహియో కౌంటీల పోలీస్ విభాగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో వారి సమాచారాన్ని నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లోనూ నమోదు చేశారు. చివరికి, లోయలో పడి ఉన్న వాహనాన్ని గుర్తించి అందులో ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్‌కు సుమారు ఐదు గంటల సమయం పట్టింది.

భారతీయ సమాజంలో విషాదం

ఈ దుర్ఘటన భారతీయ అమెరికన్ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. న్యూయార్క్‌లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా (CHAI) ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. CHAI అధ్యక్షుడు సిబు నైర్ మాట్లాడుతూ "వారి సురక్షిత రాక కోసం సమాజమంతా ఎదురుచూసింది. కానీ ఈ విషాదకర ఫలితం మాకు తీరని ఆవేదనను మిగిల్చింది" అని తెలిపారు.

ప్రస్తుతం స్థానిక పోలీస్ శాఖ ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజం సంతాపంతో మౌనమై నిలిచిపోయింది.

Tags:    

Similar News