అమెరికాలో మానవత్వానికి, న్యాయానికి ఒక పెద్ద పరీక్ష పెట్టి 73 ఏళ్ల భారత వృద్ధురాలు
హర్జిత్ కౌర్ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2012లో ఆమె ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది.;
అమెరికా గర్వంగా చెప్పుకునే విలువలు - స్వేచ్ఛ, మానవ హక్కులు, న్యాయం అమలులో పనిచేయడం లేదు.. ఆ విలువలు 73 ఏళ్ల భారతీయ నానమ్మ హర్జిత్ కౌర్ విషయంలో పాటించలేదు. మూడు దశాబ్దాలుగా బే ఏరియాలో నివసిస్తూ సమాజంలో కలిసిపోయిన ఈ వృద్ధురాలిని అకస్మాత్తుగా ICE (ఇమ్మిగ్రేషన్ మురియు కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్) అధికారులు కస్టడీలోకి తీసుకోవడం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు.. ఇది ఒక వ్యవస్థలోని నిర్లక్ష్యానికి, హృదయం లేని పాలనకు నిదర్శనం.
*ఒక వృద్ధురాలిని లక్ష్యం చేయడం ఎందుకు?
హర్జిత్ కౌర్ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2012లో ఆమె ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది. అప్పటి నుంచి ఆమె ICE పర్యవేక్షణలోనే ఉన్నారు. అధికారుల సూచనలన్నింటినీ పాటించారు, అవసరమైనప్పుడు చెక్-ఇన్‌లకు వెళ్ళారు. భారత కాన్సులేట్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ తెప్పించుకోవడానికి ఆమె కుటుంబం పదే పదే ప్రయత్నించింది. కానీ 13 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వం తెప్పించలేని డాక్యుమెంట్లను ఒక వృద్ధురాలి కుటుంబం ఎలా తెప్పించగలదు?
మరోవైపు నేరాలు చేసినవారు, తుపాకులు పట్టుకుని తిరిగేవారు బయట స్వేచ్ఛగా ఉన్నప్పుడు, ఎలాంటి నేర చరిత్ర లేని, సమాజానికి ఎలాంటి ప్రమాదం లేని ఒక వృద్ధురాలిని మాత్రమే "లక్ష్యం" చేసుకోవడం ICE ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వైరుధ్యం అమెరికా న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
*సమాజం నుంచి పెరుగుతున్న నిరసన స్వరం
ఎల్ సోబ్రాంటేలో సుమారు 200 మంది ప్రజలు “Hands Off Our Grandma” (మా నానమ్మను వదలండి) అంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ఈ కేసు చట్టపరమైన సమస్య మాత్రమే కాదని, అది ప్రజల మనసులను తాకిన అన్యాయమని నిరూపిస్తుంది. “ఆమె మా అమ్మమ్మ మాత్రమే కాదు, అందరి అమ్మమ్మ” అని హర్జిత్ కౌర్ మనవరాలు చెప్పిన మాట ఆమె బే ఏరియా సమాజంలో ఎంతగా కలిసిపోయిందో తెలియజేస్తుంది. ఆమెను ఒక తల్లిగా, ఒక నానమ్మగా ప్రజలు చూస్తున్నారు.
రాజకీయ నాయకుల మద్దతు
ఈ కేసు ప్రాముఖ్యత రాజకీయ నాయకుల దృష్టిని కూడా ఆకర్షించింది. కాంగ్రెస్ సభ్యుడు జాన్ గారామెండి ఈ సంఘటనను "misplaced priorities" (ప్రాధాన్యతలు తప్పిన చర్య)గా అభివర్ణించారు. సమాజానికి ప్రమాదం లేని వృద్ధురాలు కస్టడీలో ఉండటం, అమెరికా న్యాయవ్యవస్థ పట్ల ఒక ప్రతికూల సంకేతాన్ని పంపుతోందని ఆయన పేర్కొన్నారు. కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ కూడా ఈ కేసుకు మద్దతు తెలిపారు, ఇది రాజకీయంగా విస్మరించలేని అంశమని స్పష్టం చేశారు.
మానవత్వం ఎక్కడ?
థైరాయిడ్, మోకాళ్ల నొప్పి, మైగ్రేన్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ వయసులో ఆమెకు సరైన మందులు అందకపోవడం శిక్ష కాదు, అది ఒక రకమైన క్రూరత్వం. "నన్ను బయటకు తీసుకురండి" అంటూ కస్టడీలో ఆమె వేడుకుంటున్న మాటలు మానవత్వం ఉన్న ఏ ఒక్కరినైనా కదిలిస్తాయి. హర్జిత్ కౌర్ కేసు కేవలం ఒక మహిళకు న్యాయం చేయడమే కాదు. ఇది అమెరికా దాని స్వంత విలువలను ఎంతవరకు పాటిస్తోందో పరీక్షించే ఒక అద్దం. ఈ సంఘటన అమెరికాలోని మానవత్వానికి, న్యాయానికి ఒక పెద్ద పరీక్ష.