డ్రగ్స్ మత్తులో ఇల్లీగల్ ఇండియన్ ట్రక్ డ్రైవర్ దారుణం.. ముగ్గురి మృతి

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;

Update: 2025-10-23 16:13 GMT

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రగ్స్ మత్తులో అతివేగంగా ట్రక్ నడపడం వల్ల ఈ దుర్ఘటన సంభవించింది. ఇందులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన ఆ డ్రైవర్ జశన్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ భయంకరమైన ప్రమాదం దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్ బర్నిర్డినో కౌంటీ ఫ్రీవే వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల భారతీయుడు జశన్‌ప్రీత్ సింగ్, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వ్యక్తి, డ్రగ్స్ తీసుకుని మితిమీరిన వేగంతో ఫ్రైట్‌లైనర్ ట్రక్‌ను నడిపాడు. హై స్పీడ్లో వచ్చిన సింగ్ బ్రేక్ వేయకుండానే, ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదులుతున్న ముందున్న వాహనాలను బలంగా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు, వీరిలో ట్రక్ డ్రైవర్ జశన్‌ప్రీత్ సింగ్‌తో పాటు, టైర్ మార్చడానికి సహాయం చేస్తున్న ఒక మెకానిక్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద దృశ్యాలు జశన్‌ప్రీత్ సింగ్ నడిపిన ట్రక్‌లోని సీసీ కెమెరా (డ్యాష్‌క్యామ్) లో రికార్డయ్యాయి.

*డ్రగ్స్ వినియోగం, అరెస్ట్ , అభియోగాలు

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నివేదికల్లో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా నిర్ధారణ అయింది. సింగ్‌పై డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ , హత్య వంటి తీవ్రమైన అభియోగాలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

*అక్రమ వలసదారుడి నేపథ్యం

జశన్‌ప్రీత్ సింగ్ అమెరికాలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేని అక్రమ వలసదారుడు అని యూఎస్ హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ ధృవీకరించింది. సింగ్ 2022లో దక్షిణ అమెరికా సరిహద్దును దాటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు.

2022 మార్చిలో కాలిఫోర్నియాలోని ఎలో సెంట్రో సెక్టార్ వద్ద బోర్డర్ పెట్రోల్ అధికారులకు చిక్కినప్పటికీ, అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలోని ‘ఆల్టర్నేటివ్స్ టు డిటెన్షన్’ విధానం వల్ల విచారణ పెండింగ్‌లో ఉండటంతో అతడిని విడుదల చేశారు. ప్రస్తుత అరెస్ట్ తర్వాత, యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (USICE) అతడిపై ఇమ్మిగ్రేషన్ డిటైనర్ను జారీ చేసింది.

గతంలో ఇలాంటి ఘటనలు.. ఆందోళనలు

అమెరికాలో అక్రమ వలసదారులు ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తూ ప్రమాదాలకు కారణం కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఆగస్టులో పంజాబ్‌కు చెందిన హర్జిందర్ సింగ్ అనే మరో భారతీయ అక్రమ వలసదారు చేసిన పొరపాటు వల్ల కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతడు 2018లో మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించి, ఆ తర్వాత కాలిఫోర్నియాలో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు అధికారులు తెలిపారు.

ఈ తరహా వరుస ప్రమాదాల కారణంగా అక్రమంగా దేశంలోకి వచ్చిన వ్యక్తులు వాణిజ్య ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఎలా పొందుతున్నారు అనే అంశంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అక్రమ వలసదారుల నియామకాలపై ఫెడరల్ స్థాయిలో విచారణలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో అక్రమ వలసదారులపై అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే.



Tags:    

Similar News